విషాదం చోటు చేసుకున్న తీరు..
ప్రఖ్యాత కథకుడు ప్రదీప్ మిశ్రా ఆధ్వర్యంలో జరగాల్సిన కన్వర్ యాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. యాత్ర ప్రారంభం కాకముందే భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగిపోయింది. కుబెరేశ్వర్ ధామ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు ఒకేసారిగా ముందుకు తోసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒక పూజా సామాగ్రి దుకాణం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనానంతర పరిస్థితి..
ఈ విషాద ఘటన తర్వాత ప్రాంగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సమయానికి రాలేకపోయాయి. ఇండోర్-భోపాల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పరిస్థితి మరింత జటిలమైంది. చనిపోయిన మహిళలను అమీనా బాయి (40), సతీబాయి (50) గా పోలీసులు గుర్తించారు.
నిర్వాహకుల వైఫల్యంపై ప్రశ్నలు..
ఈ దుర్ఘటనతో నిర్వాహకులపై, అధికారులపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 4 వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పినా, లక్షల్లో భక్తులు వచ్చారు. అంతేకాకుండా, తొక్కిసలాట జరిగిన సమయంలో భక్తుల రక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడం, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలు అమలు చేయకపోవడంపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక వేడి, ఉక్కపోతతో భక్తులు అస్వస్థతకు గురవుతున్నా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఆశ్రమం లోపల, బయట వందలాది మంది ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.


