Elderly man marries younger woman : ప్రేమకు వయసుతో పనేముంది? మనసులు కలిస్తే చాలు.. ఏ వయసులోనైనా కొత్త జీవితం ప్రారంభించవచ్చని నిరూపించింది ఓ జంట. డెబ్బై ఏళ్ల వృద్ధుడు, ముప్పై ఐదేళ్ల మహిళ ప్రేమించి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వారి ప్రేమకు గ్రామస్థులంతా అండగా నిలిచి, అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం విశేషం. ఇంతకీ ఈ వింత ప్రేమకథ ఎక్కడ మొదలైంది..? వారి పెళ్లికి గ్రామస్థులు ఎందుకు మద్దతుగా నిలిచారు..?
ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టం. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జంట ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. బిలాస్‌పుర్‌లోని సర్కండ చింగ్రాజ్‌పర ప్రాంతానికి చెందిన దాదు రామ్ గంధర్వ (70) అనే వృద్ధుడు, అదే ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు వయసు అడ్డురాలేదు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కలవరపెట్టలేదు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
గ్రామస్థుల సమక్షంలో పెళ్లి: కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే దాదు రామ్, తన ప్రేమ విషయాన్ని ఆ మహిళకు చెప్పగా ఆమె కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారని తెలుసుకున్న స్థానికులు, వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి వారి ఆచారాల ప్రకారం, సమీపంలోని శివాలయంలో శివుని సాక్షిగా ఏడడుగులు వేయించి వారిని ఒక్కటి చేశారు. కేవలం పెళ్లి చేయడమే కాకుండా, సంగీతం, నృత్యాలతో వివాహ వేడుకను ఓ పండుగలా జరిపించారు. ఈ అరుదైన వివాహాన్ని ఆశ్చర్యంగా తిలకించిన స్థానికులు, చప్పట్లు కొడుతూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఓ విషాదం: అయితే, వృద్ధాప్యంలో జరిగే పెళ్లిళ్లన్నీ ఇంతటి శుభపరిణామాలతో ముగియవనడానికి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. జౌన్‌పుర్‌కు చెందిన సంగ్రూ రామ్ (75) అనే వ్యక్తి, మొదటి భార్య చనిపోవడంతో తోడు కోసం మన్‌భవిని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లయిన మరుసటి రోజే ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో ‘సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్’ (మెదడులో రక్తస్రావం) వల్లే మరణించినట్లు తేలింది. మద్యం సేవించిన తర్వాత శృంగార సామర్థ్యాన్ని పెంచే మందులు వాడటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.


