మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. గత మంగళవారం (డిసెంబరు 6)న రాత్రి బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ 55 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఆ విషయాన్ని చిన్నారి అక్క వెంటనే తండ్రికి చెప్పగా.. వారు ఆ ప్రాంతానికి వెళ్లి చూశారు. బాలుడు లోపలి నుండి శబ్దాలు చేశాడు. వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారమివ్వగా.. వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బోర్ వెల్ లోపల కెమెరాను అమర్చి బాలుడి కదలికలను పర్యవేక్షించారు. ఆక్సిజన్ సరఫరా చేశారు.
చిన్నారిని ప్రాణాలతో బయటికి తీసేందుకు సాయశక్తులా కృషి చేశారు. నాలుగురోజుల తర్వాత.. ఈరోజు చిన్నారిని బోరుబావి నుండి బయటికి తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించగా..చిన్నారి చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. బోరుబావి వద్ద పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో.. రెస్క్యూ ఆపరేషన్ 4 రోజుల పాటు కొనసాగిందని అధికారులు తెలిపారు.