Satyendra Jain: వడ్డించేవాడు మనవాడైతే సహా బంతిలో చివర కూర్చున్నా ఇస్తరిలో అన్నీ వచ్చి పడతాయనే సామెత అందరికీ తెలిసిందే. అలాగే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెత కూడా వినే ఉంటారు. అప్పుడప్పుడు మన రాజకీయ నాయకులను చూస్తుంటే ఈ సామెతలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పదవిలో ఉన్న నేతలైనా.. కోట్లకు పడగలెత్తిన బడాబాబులైనా జైలుకు వెళ్తే అక్కడ వాళ్లకు దక్కే మర్యాదలు.. సౌకర్యాలను చూస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా దొరకవేమో అనిపిస్తుంటుంది.
గతంలో జైలులో కూడా రాజభోగాలు అనుభవించిన కొందరు రాజకీయ నేతలను మనం చూడగా.. ఇప్పుడు అదే కోవలో ఢిల్లీ మంత్రి కూడా చేరారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న సత్యేంద్రకుమార్ జైన్ మే 30న మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సత్యేంద్రకుమార్ కాళ్లకు ఆయిల్ మస్సాజ్, మర్దనా చేయించుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మంచం మీద దర్జాగా పడుకున్న మంత్రికి మరో వ్యక్తికి మర్దనా చేస్తుండగా బెడ్ మీద టీవీ రిమోట్, తాగేందుకు మినరల్ వాటర్ బాటిల్ వంటివి కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఇది జైలు గదా స్టార్ హోటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇప్పటి వీడియో కాదు సెప్టెంబర్ నెల నాటి వీడియో అని ఆప్ నేతల వివరణ ఇస్తున్నా.. ఆ తర్వాత కూడా అదే జైలులో ఉన్న ఈ మంత్రికి అదే మర్యాదలు దక్కుతున్నాయని మరికొన్ని వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. ఈ వీడియో దెబ్బకు పదిమంది జైలు అధికారుల మీద వేటు పడగా.. ఆప్ పార్టీకి రాజకీయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.