Tamil Nadu political Devolopments: ఒకవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు నీలినీడలు… మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం గెలుపుపై అచంచల విశ్వాసం! తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం ఈ రెండు కీలక ఘట్టాల మధ్య నడుస్తోంది. కరూర్ ఘటన తమ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినా, అవన్నీ తాత్కాలికమేనని, వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే తమకు ప్రధాన పోటీ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘గెలుపు మనదే’.. విజయ్ ధీమా : మహాబలిపురంలో జరిగిన టీవీకే పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో నటుడు విజయ్, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాన పోటీ డీఎంకేతోనే: తమిళనాడులో అధికార డీఎంకేకు తమ పార్టీయే బలమైన ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల పోరు ఆ రెండు పార్టీల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.
100% గెలుపు: ఈ పోరులో టీవీకే 100 శాతం విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “ప్రజల రూపంలో దేవుడు, ప్రకృతి మనతో ఉన్నారు, ఇంకెవ్వరూ మనల్ని ఆపలేరు,” అని అన్నారు.
పొత్తులపై సర్వాధికారం: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలను పార్టీ ఏకగ్రీవంగా విజయ్‌కే అప్పగించింది. ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి ముందు, కరూర్ తొక్కిసలాట మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం : సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.
టీవీకే కార్యాలయంలో సోదాలు: సోమవారం సీబీఐ అధికారులు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి, కార్యక్రమానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, హాజరైన నేతల వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు పార్టీ నేత నిర్మల్ కుమార్ తెలిపారు.
3D లేజర్ స్కానింగ్: తొక్కిసలాటకు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు అధునాతన 3D లేజర్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
306 మందికి సమన్లు: ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు, బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో సహా మొత్తం 306 మందిని విచారించనున్నట్లు, వారికి ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో తొలుత సిట్ దర్యాప్తు ప్రారంభించినా, దానిపై నమ్మకం లేదని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ టీవీకే పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


