Al-Qaeda Network In India: ఉగ్రవాదమంటే మగవారికే పరిమితం అనుకుంటే పొరపాటే. కంటికి కనిపించకుండా, తెర వెనుక ఉంటూనే దేశాన్ని అస్థిరపరిచే కుట్రలకు మహిళలు కూడా నాయకత్వం వహిస్తున్నారన్న చేదు నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిషేధిత అల్‌ఖైదా అనుబంధ సంస్థకు దేశవ్యాప్తంగా నాయకత్వం వహిస్తోందన్న ఆరోపణలపై ఓ మహిళను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ మహిళకు, మన హైదరాబాద్‌తోనూ సంబంధాలున్నాయని తెలియడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఉగ్రవాద సానుభూతిపరుల ఆట కట్టించేందుకు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ కీలక అరెస్ట్ జరిగింది. అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) అనే నిషేధిత సంస్థకు చెందిన 30 ఏళ్ల షామా పర్వీన్‌ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ టు బెంగళూరు: వాస్తవానికి జార్ఖండ్‌కు చెందిన షామా, గత నాలుగేళ్లుగా బెంగళూరులో నివసిస్తోంది. అయితే, అంతకు ముందు కొన్ని రోజుల పాటు ఆమె మన హైదరాబాద్‌లోనూ నివాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాతే తన మకాంను బెంగళూరుకు మార్చినట్లు తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/amit-shah-pahalgam-attack-pok-reclaim/
ఆన్‌లైన్ రాడికలైజేషన్: షామా పర్వీన్ తన కార్యకలాపాలకు సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ను, ఒక ఆయుధంగా వాడుకుంది. ఆకర్షణీయమైన పోస్టులతో, రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక అల్‌ఖైదా ఆపరేటివ్‌కు సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు.
ఈ అరెస్ట్ ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. జులై 23న AQISతో సంబంధాలున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురిని ఉగ్రవాద అనుమానితులను గుజరాత్, ఢిల్లీ, నోయిడాలలో ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షామా పర్వీన్ పేరు బయటకు వచ్చింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ గ్రూప్ సభ్యులందరికీ షామానే నాయకత్వం వహిస్తున్నట్లు తెలియడంతో అధికారులు నివ్వెరపోయారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/dgca-audit-indian-airlines-safety-lapses/
రహస్య సంభాషణలు: వీరంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సోషల్ మీడియాలోని ఒక రహస్య, ‘ఆటో-డిలీటెడ్’ యాప్‌ను వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ యాప్ ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు.
స్లీపర్ సెల్స్: ఈ ముఠాకు కేవలం దేశీయంగానే కాకుండా, విదేశాల్లోని అల్‌ఖైదా, ఇతర ఉగ్ర సంస్థల స్లీపర్ సెల్స్‌తోనూ సంబంధాలున్నాయని, దేశ భద్రతకు సంబంధించిన అత్యంత గోప్యమైన, సున్నితమైన సమాచారాన్ని వీరు ఉగ్ర ముఠాలకు అందిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం షామాను అహ్మదాబాద్‌కు తరలించి, మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన మరికొంతమంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


