లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో(Delimitation) దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని సౌత్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం డీలిమిటేషన్‌పై తీవ్రంగా పోరాడుతోంది. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు.
అలాగే పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తమ నిరసన తెలియజేయనున్నారు. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.