Amit Shah on Bihar election 2025 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచార శంఖారావం పూరించారు. “ఈసారి బిహార్ ప్రజలు నాలుగు దీపావళులు జరుపుకుంటారు, నాలుగోది నవంబర్ 14న ఎన్డీఏ భారీ విజయంతో” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, కాషాయ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ‘జంగిల్ రాజ్’ను అంతం చేసిన నీతీశ్ కుమార్ నాయకత్వాన్నే బలపరుస్తూ, ప్రతిపక్షాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు షా ప్రసంగంలోని ముఖ్యాంశాలేంటి..? ఆయన ఎందుకంత ధీమాగా ఉన్నారు..?
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిహార్‌లోని శరణ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష ‘మహాఘట్‌బంధన్’ కూటమిపై, ముఖ్యంగా ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“లాలూ-రబ్రీ దేవిల ‘జంగిల్ రాజ్’ పాలన నుంచి బిహార్‌కు విముక్తి కల్పించింది నీతీశ్ కుమార్. ఆయన నాయకత్వంలోనే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మా ప్రభుత్వం రాకముందు ఇక్కడ హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు సర్వసాధారణం. ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ కుమార్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.”
– అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
‘నాలుగు దీపావళులు’.. షా లెక్క ఇదే : ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయమని, ఈసారి బిహార్ ప్రజలు నాలుగు దీపావళులు జరుపుకుంటారని షా అన్నారు.
మొదటిది: అయోధ్యలో రాముడు కొలువైన సందర్భంగా.
రెండోది: ప్రభుత్వ పథకం కింద మహిళల ఖాతాల్లో రూ.10,000 జమ అయినప్పుడు.
మూడోది: జీఎస్టీని 5 శాతానికి తగ్గించినప్పుడు.
నాలుగోది: నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడి, ఎన్డీఏ ఘన విజయం సాధించినప్పుడు.
ఆర్జేడీ అభ్యర్థిత్వంపై ఆగ్రహం : గ్యాంగ్‌స్టర్ మహ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు ఆర్జేడీ టికెట్ కేటాయించడంపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి అభ్యర్థులను బరిలోకి దింపి, ప్రజల భద్రతకు ఎలా హామీ ఇస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఎన్డీఏలో ఐక్యత.. సీట్ల సర్దుబాటు పూర్తి : ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చీలికలు లేవని, నీతీశ్ కుమార్ నాయకత్వంలోనే తాము ఐక్యంగా పోటీ చేస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమిలో సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. మొత్తం 243 స్థానాలకు గాను, బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో, చిరాగ్ పాసవాన్ ఎల్జేపీ (రాంవిలాస్) 29 స్థానాల్లో, ఇతర మిత్రపక్షాలు 12 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.


