Amit Shah Bihar election speech : బిహార్ ఎన్నికల కురుక్షేత్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కుటుంబ పాలన, పాత రోజుల ‘జంగిల్ రాజ్’ అనే అస్త్రాలను సంధిస్తూ ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని లక్ష్యంగా చేసుకున్నారు. లాలూ, సోనియాలకు రాష్ట్ర భవిష్యత్ కన్నా తమ కుమారుల రాజకీయ భవిష్యత్తే ముఖ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత రాజేశాయి. అసలు అమిత్ షా తన ప్రసంగంలో పదేపదే ‘జంగిల్ రాజ్’ అని ఎందుకు హెచ్చరించారు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. జమయీ, భగల్పుర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
‘జంగిల్ రాజ్’ హెచ్చరిక: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. “నవంబర్ 11న జరిగే పోలింగ్‌లో మీరు కమలం లేదా బాణం గుర్తుపై ఓటు వేయకపోతే, బిహార్ మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి, ‘జంగిల్ రాజ్’లోకి జారుకోవడం ఖాయం” అని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే వరదల నియంత్రణ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ, “అదే లాలూ కుమారుడు గెలిస్తే, ఆయన ‘అపహరణ (కిడ్నాప్) శాఖ’ను మళ్లీ తెరుస్తారు” అంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.
కుటుంబ పాలనపై కన్నెర్ర: లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీలకు బిహార్ ప్రజల అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అమిత్ షా ఆరోపించారు. “వారిద్దరి ఆలోచన ఒక్కటే. లాలూ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని చూస్తుంటే, సోనియా తన కుమారుడిని ప్రధానిని చేయాలని కలలు కంటున్నారు. వారికి వారి కుమారుల భవిష్యత్ గురించే తప్ప, పేద ప్రజల గురించి, బిహార్ అభివృద్ధి గురించి ఆలోచన లేదు” అని విమర్శించారు.
అభివృద్ధి వర్సెస్ అవమానం: ప్రధాని మోదీ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో బిహార్‌కు ఎన్నో రోడ్లు, వంతెనలు, ఇథనాల్, చక్కెర పరిశ్రమలు వచ్చాయని షా గుర్తుచేశారు. “మాకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి, బిహార్‌ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం” అని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. “దేశంలో మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరని అడిగితే, ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ పేరు చెప్పారు. అదే స్టాలిన్ పార్టీ డీఎంకే, బిహారీలను అవమానించింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించింది, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంది. అలాంటి వారితో వీరు అంటకాగుతున్నారు” అని మండిపడ్డారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం: దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని వైఖరితో ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. “మన్మోహన్ సింగ్, సోనియా, లాలూల ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదులు రోజూ మన దేశంలోకి చొరబడి దాడులు చేసేవారు. కానీ స్పందించే ధైర్యం నాటి ప్రధానికి లేదు. మా ప్రభుత్వం ఉరి, పుల్వామా దాడులకు ప్రతిగా సర్జికల్, ఎయిర్ స్ట్రైక్‌లతో పాకిస్థాన్‌లోకి చొరబడి మరీ సమాధానం చెప్పింది. ఇటీవల పహల్గాం దాడి జరిగిన 22 రోజుల్లోనే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవాదులను ఏరివేసింది” అని అన్నారు.


