Anand Mahindra : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బిజినెస్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన చేసే పోస్టులు ఆసక్తికరంగానో, ఆలోచింపచేసేదిగానో ఉంటాయి. లోకల్ టాలెంట్ ను వెలికి తీయడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన మరో కొత్త సృజనాత్మకతను నెటీజన్లకు పరిచయం చేశారు.
వాతావరణ కాలుష్యంపై ఇటీవల అందరిలో కాస్త స్పృహ పెరిగింది. అందుకనే చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. చూడడానికి ఈ వాహనం బైక్‌లాగే కనిపిస్తుంది. అయితే.. ఇది ఆరుగురు కూర్చునే విధంగా వేరువేరు సీట్లతో పొడవుగా ఉంది. ఈ వాహనం తయారు చేయడానికి రూ.12 వేలు ఖర్చు అయినట్లు, ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 150 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణించవచ్చునని ఆ వీడియోలో ఉన్న యువకుడు చెప్పాడు.
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. “గ్రామీణ ప్రాంతాల్లోని రావాణా రంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం” అని రాసుకొచ్చారు. ఈ వాహనానికి చిన్న చిన్న మార్పులు చేసి అంతర్జాతీయంగా వినియోగించవచ్చు. ఐరోపాలోని రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల్లో వాడుకోవచ్చు అని అన్నారు.
డిసెంబర్ 1న షేర్ చేసిన ఈ వీడియోను షేర్ చేయగా 4 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వినూత్న ప్యాసింజర్ వాహనాన్ని నెటిజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు.