Sunday, May 5, 2024
Homeనేషనల్AP & Telangana CS meeting: ఏపీ-తెలంగాణ సీఎస్ ల భేటీ

AP & Telangana CS meeting: ఏపీ-తెలంగాణ సీఎస్ ల భేటీ

పారదర్శకంగా, సమన్వయంతో..

ఎన్నికల నిర్వహణపై ఎపి,తెలంగాణా రాష్ట్రాల సి.ఎస్.ల సమావేశం.

- Advertisement -

త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పని చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాదులోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో అంతర్ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్. జవహర్ రెడ్డి, శాంతి కుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర డీజీపి రవి గుప్త, అడిషనల్ డిజిలు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్, ఎపి అడిషనల్ డిజి డా.శంకబ్రత బాగ్చి, వాణిజ్య పన్నులు,ఎక్సయిజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ, తెలంగాణా పిసిసిఎఫ్ ఆర్.ఎం.దొబ్రియెల్, ఎపి పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి తదితర అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ, లోక్ సభ స్థానాలకు మే 13న ఒకేసారి ఎన్నికలు జరగ నున్నందున ఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా నిర్వహించేందుకు తెలంగాణాతో కలిసి పూర్తి స్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిరోధానికి ఆపరేషన్ పరివర్తన పేరిట చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాలను ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో ఉన్న వివిధ రాష్ట్ర సరిహద్దుల్లో పలు శాఖల ద్వారా 129 పైగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లను ప్రలోబ పెట్టేందుకు అక్రమ మద్యం రవాణా, డబ్బు పంపిణీ, వివిధ వస్తువుల రవాణాను నియంత్రించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ద్వారా పటిష్టమైన నిఘా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంచి సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ మే 13 న జరిగే పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల పరిధిలోని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉందని ఇదే రకమైన వాతావరణాన్ని పోలింగ్ పూర్తయ్యే వరకు మరింత పకడ్బందీగా కొనసాగేలా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశం దోహద పడుతుందని పేర్కొన్నారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా కాకుండా ఆయా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్-పోస్టులలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్-పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులు, ఎక్సయిజ్ శాఖ ద్వారా ఎనిమిది, 224 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, వాణిజ్య పన్నుల ద్వారా 7 చెక్-పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, చత్తీస్గఢ్ నుండి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగకుండా ఇరురాష్ట్రాల పోలీసులు, కేంద్ర పోలీస్ బలగాల మధ్య పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నామని సిఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News