RSS| బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతోన్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) స్పందించింది. ఈ దాడుల విషయంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్కాన్ (ISKCON)కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishnadas) అరెస్ట్ అన్యాయమని పేర్కొంది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
తమ స్వీయరక్షణ కోసం బంగ్లాదేశ్ హిందువులు ప్రజాస్వామ్యయుతంగా తమ గళాన్ని వినిపిస్తున్నారని… ఆ స్వరాన్ని అణచివేసేందుకు చట్టవ్యతిరేకంగా పనిచేయడం దారుణమని మండిపడింది. బంగ్లాదేశ్ హిందువుల దాడి విషయంలో అంతర్జాతీయ మద్దతును కూడగట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బంగ్లా బాధితులకు కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం సంఘీభావంగా నిలబడాలని సూచించింది.
కాగా బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నిరసనలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు అక్కడి ముస్లింలు హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు.