Beaver Supermoon on November 5th: రేపే కార్తిక పౌర్ణమి. శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో, శివనామస్మరణతో అత్యంత భక్తి భావాన్ని సంతరించుకుంటాయి. కార్తిక దీపాల వెలుగుల్లో వాతావరణం అంతా ప్రశాంతతను సంతరించుకుంటుంది. అలాంటి దివ్యమైన రోజు.. మరో అద్భుతం చోటుచేసుకోబోతుంది. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. నవంబర్ 5, బుధవారం నాడు ఆకాశంలో చంద్రుడు ఎప్పటి కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్నే బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఆ విశేషాలు..
Also Read: https://teluguprabha.net/devotional-news/karthika-pournami-jwala-thoranam-significance-stories-2025/
పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరడంతో ఈ అద్భుతం దృశ్యం ఆవిష్కృతమవుతుంది. గతంలో చైనాలోని చెంగ్డులోని లాంగ్‌క్వాన్ పరత్వ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించగా.. ఈ సారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా రానున్నాడు. కాగా, ఈ ఏడాదిలో ఏర్పడనున్న మూడు సూపర్‌మూన్‌లో ఇది రెండోది. ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్ సూపర్ మూన్‌గా ఈ పేరు పెట్టారు. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించే, నదులు గడ్డకట్టే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్‌గా దీనిని చెప్పుకొంటారు.
బుధవారం భూమి నుంచి సూపర్‌మూన్ 3,56,980 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చివరిసారిగా ఫిబ్రవరి 2019లో భూమికి చంద్రుడు ఇంత దగ్గరగా వచ్చాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ దృశ్యం రిపీట్ కాబోతుంది.
బీవర్ సూపర్ మూన్‌ను చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఆకాశం వైపుగా చూస్తే ఈ దృశ్యం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.49 గంటలకు పరిపూర్ణమైన రూపంలో చంద్రుడు మనకు కనువిందు చేస్తాడు. మూడవ సూపర్‌మూన్ డిసెంబర్ 2025లో సంభవిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో మరొకటి వస్తుంది. మళ్లీ నవంబర్ 2026 వరకు మరో సూపర్ మూన్ కోసం వేచి చూడాలి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షిస్తూ.. మన సెల్‌ఫోన్లలో అపురూపంగా దాచుకుందాం.


