Saturday, November 15, 2025
Homeనేషనల్Union Cabinet: బిహార్‌కు కేంద్రం వరాల జల్లు.. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు మెడికల్‌ సీట్ల...

Union Cabinet: బిహార్‌కు కేంద్రం వరాల జల్లు.. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు మెడికల్‌ సీట్ల పెంపు

Big Gifts For Bihar Ahead Of Assembly Elections: త్వరలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో సుమారు రూ.6 వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా యూజీ, పీజీ వైద్యవిద్య సీట్ల పెంపునకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, బిహార్‌లో రైల్వేకు సంబంధించి రూ. 2192 కోట్లతో భక్తియార్‌పుర్‌-రాజ్‌గిర్‌-తిలయ్యా డబ్లింగ్‌ పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక సాహెబ్‌గంజ్‌-అరెరాజ్‌-బెతియా మధ్య రూ.3822 కోట్లతో 78.9 కి.మీ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుతో రాజధాని పట్నా-బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగు పడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.69,725 కోట్ల ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/epfo-new-rule-atm-withdrawals/

5వేల పీజీ మెడికల్‌ సీట్ల పెంపునకు ఆమోదం..

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5 వేల పీజీ సీట్లకు ఆమోదం తెలిపింది. పెంచిన సీట్లలో ఎక్కువగా బీహార్‌ వైద్య కళాశాలలకే దక్కడం గమనార్హం. వీటితోపాటు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం (సీఎస్‌ఎస్‌) మూడో ఫేజ్‌ కింద 2028-29 నాటికి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 5023 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనుంది.

కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు భారీ కేటాయింపులు..

మరోవైపు, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిద్వారా బీహార్ రైతులకు భారీగా లబ్ది చేకూరనుందని తెలిపింది. బీహార్‌లో కొత్తగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏర్పాటు చేస్తామని, మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక చేపట్టామని.. ఐఐటీ పాట్నాను విస్తరిస్తామని తెలిపింది. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో పాటు పాట్నా ఎయిర్‌పోర్టు విస్తరణ, వెస్టర్న్‌ కోసి ప్రాజెక్టు మంజూరు, బిహార్‌ మిథిలాంచల్‌ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా, బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది.. మొత్తం 243 నియోజకవర్గాలకు అక్టోబర్ లేదా నవంబర్ 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad