Bihar’s Political Fashion Hub : బిహార్ శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో రాజధాని పట్నాలో రాజకీయ వేడి రాజుకుంది. ఓ వైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ప్రచార పర్వంలో మునిగి తేలుతుంటే, మరోవైపు వారి వస్త్రధారణ కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో నాయకులందరూ సంప్రదాయ ఖద్దరు దుస్తులకే ప్రాధాన్యత ఇవ్వడంతో పట్నాలోని కొన్ని ప్రత్యేక వీధుల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. అసలు ఆ వీధుల ప్రత్యేకత ఏంటి..? నాయకులందరూ అక్కడికే ఎందుకు క్యూ కడుతున్నారు..? దశాబ్దాలుగా ఆ దుకాణాలు రాజకీయాలతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకుందాం.
‘పవర్’ ఫుల్ వీధులు.. ఖద్దరుకు కేరాఫ్ అడ్రస్ : పట్నాలోని ఎమ్మెల్యే ఫ్లాట్‌లకు సమీపంలో ఉన్న ‘సవిలే రో’, ‘జెర్మిన్ స్ట్రీట్ అండ్ మాడిసన్ అవెన్యూ’ అనే రెండు వీధులు దశాబ్దాలుగా ఖద్దరు వస్త్రాలకు, దర్జీ దుకాణాలకు ప్రసిద్ధి గాంచాయి. ఎన్నికలొచ్చాయంటే చాలు, ఈ వీధులు రాజకీయ నాయకులతో కిటకిటలాడిపోతాయి. గెలుపు గుర్రాల నుంచి టికెట్ ఆశించే ఆశావహుల వరకు అందరిదీ ఒకటే మాట.. “ఖద్దరు బట్టలు ఇక్కడే కుట్టించాలి” అంటారు. ఇక్కడి దర్జీల చేతి వాటం అలాంటిది. కేవలం రెండు గంటల్లోనే నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా కుర్తా, పైజామా జతను సిద్ధం చేయడం వారి ప్రత్యేకత.
రెండు గంటల్లోనే రెడీ.. క్వాలిటీలో నో కాంప్రమైజ్ : “గత 20 ఏళ్లుగా ఇక్కడే ‘జై హింద్ ఖాదీ భండార్’ నడుపుతున్నాను. ఎన్నికలొస్తే మాకు తీరిక ఉండదు. అవసరమైతే 2-3 గంటల్లో 50 జతల దుస్తులను సిద్ధం చేయగల సత్తా మాకుంది,” అని దుకాణ యజమాని మహ్మద్ ఇస్తేఖర్ ఆలం తెలిపారు. అయితే, ఈసారి ఎన్నికలను కేవలం రెండు దశల్లోనే తక్కువ వ్యవధిలో నిర్వహిస్తుండటంతో గిరాకీ కాస్త తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలు దశల్లో ఎన్నికలు జరగడం వల్ల నాయకులకు, వారి అనుచరులకు కొత్త బట్టలు కుట్టించుకోవడానికి తగినంత సమయం దొరికేదని గుర్తుచేసుకున్నారు.
అన్ని పార్టీల నేతల అడ్డా : ఈ వీధుల్లోని దుకాణాలన్నీ ముస్లింలు నడుపుతున్నవే అయినా, ఇక్కడికి అన్ని పార్టీల నాయకులు వస్తుంటారు. “మేము ఏ పార్టీ అని భేదం చూడము. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్ట్.. ఇలా అందరినీ సమానంగా ఆదరిస్తాం. ఇది మా జీవనోపాధి,” అని మరో దుకాణదారుడు మొహమ్మద్ స్పష్టం చేశారు. ఆర్జేడీ నేత, చైన్‌పుర్ మాజీ ఎమ్మెల్యే బ్రజ్ కిషోర్ బింద్, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) నేత దినేశ్ పాసవాన్ వంటి వారు సైతం ఇక్కడే తమకు, తమ మద్దతుదారులకు కావాల్సిన ఖద్దరు దుస్తులను కొనుగోలు చేశారు.
మారిన ట్రెండ్.. లాలూ నుంచి మోదీ వరకు : ఒకప్పుడు బీహార్ రాజకీయ నాయకులంటే తెల్లటి కుర్తా, పైజామానే గుర్తుకొచ్చేవి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలితో ఈ డ్రెస్సింగ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. మోకాళ్ల కిందికి ఉండే కుర్తా, పొడవాటి చేతులతో వదులుగా ఉండేలా ఆయన ధరించే వస్త్రధారణ సామాన్యుడికి దగ్గరగా ఉండేది. అయితే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ధరించే హాఫ్, ఫుల్ కుర్తాల శైలి కూడా బాగా ప్రాచుర్యం పొందిందని, ఫిట్టింగ్‌గా ఉండే కుర్తాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని దర్జీ మొహమ్మద్ ఇమ్రాన్ అన్నారు.
ఇక్కడ ఖద్దరు వస్త్రం మీటరుకు రూ.160 నుంచి రూ.1,800 వరకు పలుకుతుంది. అయితే, ఎక్కువగా రూ.200-రూ.300 మధ్య ధర ఉన్న బట్టలే అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, పట్నాలోని ఈ వీధులు మాత్రం రాజకీయ నాయకుల ఖద్దరు షాపింగ్‌తో ఎప్పటికీ కళకళలాడుతూనే ఉంటాయి.


