Saturday, November 15, 2025
HomeTop StoriesBihar election : బిహార్ తొలి పోరు.. తేలేనా ఎవరి జోరు?

Bihar election : బిహార్ తొలి పోరు.. తేలేనా ఎవరి జోరు?

Bihar election dynamics : బిహార్ తొలి దశ సమరానికి తెరలేచింది. అధికారం నిలబెట్టుకోవాలని ఎన్డీఏ, తిరిగి పీఠం దక్కించుకోవాలని మహాగఠ్‌బంధన్‌ నువ్వానేనా అన్నట్లు తలపడుతుండగా, రాజకీయ చాణక్యుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి తన ‘జనసురాజ్’ పార్టీతో బరిలోకి దిగారు. గురువారం 121 నియోజకవర్గాల్లో జరగనున్న ఈ పోరులో మంత్రులు, యువనేతలు, ప్రముఖుల భవితవ్యాన్ని దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మరి ఈ త్రిముఖ పోటీలో తొలి అంకంలో పైచేయి ఎవరిది?

- Advertisement -

గణాంకాల బలాబలాలు : తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.
ఓటర్లు-అభ్యర్థులు: 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు గాను, 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 122 మంది మహిళలు. వీరి భవితవ్యాన్ని 3.75 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.

యువ ఓటర్లు: 10.72 లక్షల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
పోలింగ్ కేంద్రాలు: మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే, ఆరు నియోజకవర్గాల్లో భద్రతా కారణాల రీత్యా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది.

కూటముల కుస్తీ.. బరిలో ఎవరెవరు : ఈ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఎన్డీఏ కూటమి: జేడీయూ 57, బీజేపీ 48, ఎల్జేపీ 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మహాగఠ్‌బంధన్‌: ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ-ఎంఎల్ 14 స్థానాల్లో బరిలో ఉన్నాయి.
జనసురాజ్ పార్టీ: తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏకంగా 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పార్టీ తరఫున ఓ ట్రాన్స్‌జెండర్ కూడా పోటీ చేస్తుండటం విశేషం.

అందరి దృష్టి వీరిపైనే : తొలి విడతలో పలువురు ప్రముఖులు, మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మంత్రుల పరంపర: నితీశ్ సర్కారులోని 16 మంది మంత్రులు, అందులో ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి (తారాపుర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్) బరిలో ఉన్నారు.
యాదవ్ సోదరులు: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్ నుంచి, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ చేస్తున్నారు.
ఇతర ప్రముఖులు: దివంగత నేత షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహబ్ (ఆర్జేడీ), ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రవణ్ కుమార్ (జేడీయూ), జానపద కళాకారిణి మైథిలీ ఠాకూర్ (బీజేపీ), భోజ్‌పురి నటుడు శత్రుఘన్ యాదవ్ (ఖేసరిలాల్ యాదవ్) వంటి వారు బరిలో నిలిచి ఆసక్తి రేపుతున్నారు.

2020 ఎన్నికల్లో ఎన్డీఏ 125 స్థానాలతో అధికారం చేపట్టగా, మహాగఠ్‌బంధన్ 110 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుంది, తొలి విడత తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందనేది ఉత్కంఠగా మారింది. మిగిలిన 122 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad