Bihar assembly election social media campaign : బిహార్ ఎన్నికల కురుక్షేత్రంలో కత్తులు, కటార్లే కాదు, స్మార్ట్‌ఫోన్లు కూడా దూసుకెళ్తున్నాయి. సభలు, ర్యాలీలతో క్షేత్రస్థాయిలో నేతలు హోరెత్తిస్తుంటే, మరోవైపు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ యుద్ధం అంతకుమించి అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలోని 7 కోట్ల మందికి పైగా ఉన్న సోషల్ మీడియా సైన్యాన్నే లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో అదరగొడుతున్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లను రంగంలోకి దింపుతూ, మీమ్స్‌తో, వీడియోలతో ఓటరు మనసు గెలిచేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి.
ఆ 7 కోట్ల మందే టార్గెట్ : బిహార్ జనాభాలో 67 శాతం యువతే. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాలు ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. ఈ డిజిటల్ నాడిని పట్టుకున్న రాజకీయ పార్టీలు, తమ ప్రచారానికి దీన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్రంలోని 7 కోట్ల మంది సోషల్ మీడియా యూజర్లను, ముఖ్యంగా 3.5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యంగా పార్టీల సోషల్ మీడియా విభాగాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.
సోషల్ మీడియాలో పార్టీల బలాబలాలు..
ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ దూకుడు: అందరి కన్నా ముందుగా సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తన ‘జన్ సురాజ్’ పార్టీని డిజిటల్ వేదికపై బలంగా నిలబెట్టారు. ఫేస్‌బుక్‌లో 21 లక్షలకు పైగా, ఎక్స్ లో 20 లక్షలకు పైగా ఫాలోవర్లతో పీకే పార్టీ మిగతా పార్టీలకు గట్టి సవాల్ విసురుతోంది.
ఎక్స్, యూట్యూబ్‌లలో ఆర్జేడీ హవా: క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఆ బలాన్ని సోషల్ మీడియాలోనూ చూపిస్తోంది. ఎక్స్‌లో 11 లక్షలు, ఫేస్‌బుక్‌లో 13 లక్షల ఫాలోవర్లతో పాటు, యూట్యూబ్‌లో 4.44 లక్షల సబ్‌స్క్రైబర్లతో బలంగా ఉంది.
ఫేస్‌బుక్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ: జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా ఈ డిజిటల్ రేసులో వెనకబడి లేవు. ఫేస్‌బుక్‌లో బీజేపీకి 11 లక్షల మంది ఫాలోవర్లు ఉంటే, కాంగ్రెస్ కూడా 7.22 లక్షల మందితో గట్టి పోటీ ఇస్తోంది. మొదటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న బీజేపీకి అన్ని వేదికల్లోనూ గణనీయమైన ఫాలోయింగ్ ఉంది.
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో జేడీయూ జోరు: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ కూడా ఫేస్‌బుక్‌లో 9.57 లక్షల ఫాలోవర్లతో, యూట్యూబ్‌లో లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లతో తన ఉనికిని చాటుకుంటోంది.
అగ్రనేతల్లో టాప్ ఎవరు..?
ఎక్స్‌లో నితీశ్ కింగ్: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 90 లక్షల మంది ఫాలోవర్లతో ‘ఎక్స్’ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఫేస్‌బుక్‌లో తేజస్వీ హవా: యువనేత, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 32 లక్షల మంది ఫాలోవర్లతో ఫేస్‌బుక్‌లో టాప్‌లో ఉన్నారు. ఎక్స్‌లో కూడా 54 లక్షల మంది ఆయన్ను అనుసరిస్తున్నారు.
కొడుకును మించిన లాలూ: అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా, లాలూ ప్రసాద్ యాదవ్ క్రేజ్ తగ్గలేదు. ఎక్స్‌లో 64 లక్షల మంది ఫాలోవర్లతో, ఆయన తన కుమారుడు తేజస్వీ కన్నా ముందంజలో ఉండటం విశేషం.
నిపుణుల విశ్లేషణ: “క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు, సోషల్ మీడియా ప్రచారం కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను, ముఖ్యంగా యువతను చేరుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం,” అని సోషల్ మీడియా నిపుణుడు కునాల్ విశ్లేషించారు. సీనియర్ జర్నలిస్ట్ కౌశలేంద్ర ప్రియదర్శి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “ప్రజల దైనందిన జీవితంలో సోషల్ మీడియా భాగమైనందున, రాజకీయ పార్టీలు దీనిని విస్మరించలేవు,” అని పేర్కొన్నారు.


