Polling percentage of Bihar elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. తొలి నాలుగు గంటల్లో (ఉదయం 11 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవ్వగా.. మొత్తం 18 జిల్లాల్లోని మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువకులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
బెగుసరాయ్ జిల్లాలో అత్యధికంగా 30.37 శాతం పోలింగ్ నమోదు అవ్వగా.. అత్యల్పంగా రాష్ట్ర రాజధాని పాట్నాలో అత్యల్పంగా 23.71 శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్ తర్వాత లఖిసరాయ్ (30.32%), గోపాల్‌గంజ్ (30.04%), మరియు సహర్సా (29.68%) జిల్లాల్లో కూడా మంచి పోలింగ్ నమోదైనట్లు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.
ఈ తొలి విడత పోలింగ్‌లో మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ప్రసాద్ యాదవ్ (రాఘోపూర్), ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వంటి కీలక నేతల అదృష్టం ఈ విడతలోనే తేలనుంది.
శాంతియుత పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగుస్తుంది, అయితే ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.
మొత్తం 243 శాసనసభ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా, మొదటి విడత ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని పాలించబోయే పార్టీకి ఒక సంకేతాన్ని ఇవ్వనున్నాయి.


