Richest candidate in Bihar elections : బిహార్ ఎన్నికల బరిలో ధనవంతులకు కొదవేమీ లేదు. కానీ, ఒక అభ్యర్థి ఆస్తి వివరాలు చూస్తే మాత్రం ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.170 కోట్లు. అయితే, అసలు వింత ఇక్కడే మొదలవుతుంది.. అంతటి కుబేరుడి భార్య పేరిట ఉన్న ఆస్తి కేవలం రూ.132! ఈ విచిత్రమైన లెక్క ఎవరిది? ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి? అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన ఈ నివేదికలోని ఆసక్తికరమైన అంశాలేమిటో చూద్దాం.
కుబేరుడు.. కుమార్ ప్రణయ్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా బీజేపీ నేత కుమార్ ప్రణయ్ నిలిచారు. ముంగేర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన మొత్తం అసెట్స్ విలువ దాదాపు రూ.170 కోట్లు. ఇందులో రూ.83.35 కోట్లు చరాస్తులు (నగదు, డిపాజిట్లు, షేర్లు) కాగా, రూ.86.65 కోట్ల విలువైన స్థిరాస్తులు (భూములు, భవనాలు) ఉన్నాయి. 2020లో ఇదే స్థానం నుంచి గెలుపొందిన ఆయన, కేవలం ఐదేళ్లలో తన వార్షిక ఆదాయాన్ని 146 శాతానికి పైగా పెంచుకోవడం గమనార్హం. 2020-21లో రూ.4.36 లక్షలుగా ఉన్న ఆయన వార్షికాదాయం, 2024-25 నాటికి రూ.10.75 లక్షలకు చేరింది.
భార్య పేరిట రూ.132.. వింతల్లోకెల్లా వింత : వందల కోట్ల అధిపతి అయిన కుమార్ ప్రణయ్, తన భార్య పేరిట కేవలం రూ.132 విలువైన చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లలో భర్త ఆదాయం రెట్టింపునకు పైగా పెరిగితే, భార్య ఆస్తి మాత్రం మూడు అంకెలకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మిలియనీర్ల బరిలో : ఏడీఆర్ నివేదిక ప్రకారం, తొలి విడతలో 121 స్థానాలకు గాను 1,303 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 519 మంది (40%) మిలియనీర్లే (కోటీశ్వరులే). వీరి సగటు ఆస్తి విలువ రూ.3.26 కోట్లు. అయితే, ఈ సగటుకు చాలా ఎత్తులో కుమార్ ప్రణయ్ ఉన్నారు. ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసు కూడా లేకపోవడం విశేషం. తొలి విడత అభ్యర్థుల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఇతర సంపన్న అభ్యర్థుల్లో జేడీయూ నేత అనంత్ సింగ్ (రూ.70 కోట్లు), మరో జేడీయూ అభ్యర్థి మనోరమా దేవి (రూ.69 కోట్లు) ఉన్నారు. ఇదే సమయంలో, కేవలం రూ.1000 ఆస్తులతో ఇద్దరు అభ్యర్థులు అత్యంత పేదవారిగా నిలిచారు.
ముంగేర్‌లో హోరాహోరీ : కుమార్ ప్రణయ్ పోటీ చేస్తున్న ముంగేర్ స్థానంలో గెలుపు అంత సులువు కాదు. గత ఎన్నికల్లో (2020) ఆయన కేవలం 1,244 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఈసారి ఆర్‌జేడీ నుంచి గట్టి పోటీదారు అవినాశ్ కుమార్ బరిలో ఉన్నారు. దీనికి తోడు జన్ సురాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. నవంబరు 6న ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.


