Saturday, November 15, 2025
Homeనేషనల్TRAFFIC TECH: ట్రాఫిక్ పోలీసుల చేతికి హైటెక్ 'అస్త్రం'.. ఇక రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడికక్కడే...

TRAFFIC TECH: ట్రాఫిక్ పోలీసుల చేతికి హైటెక్ ‘అస్త్రం’.. ఇక రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడికక్కడే చలాన్!

Tech-enabled bike interceptor : అతివేగంతో దూసుకెళ్తున్నారా? హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! మీ ఆటలు ఇక సాగవు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టేందుకు, పోలీసుల చేతికి ఓ అత్యాధునిక ‘అస్త్రం’ రాబోతోంది. అదే ‘బైక్ ఇంటర్‌సెప్టర్’. రాడార్, హెచ్‌డీ కెమెరాలు, ఆన్‌లైన్ చలాన్ సిస్టమ్‌తో కూడిన ఈ హైటెక్ బైక్, ట్రాఫిక్ పోలీసులకు సూపర్ పవర్స్‌ను అందించనుంది. అసలు ఏమిటీ బైక్ ఇంటర్‌సెప్టర్? దీని ప్రత్యేకతలేంటి?

న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో జరిగిన ‘ట్రాఫిక్ ఇన్‌ఫ్రాటెక్ ఎక్స్‌పో-2025’లో ప్రదర్శించిన ఈ ‘బైక్ ఇంటర్‌సెప్టర్’ టెక్నాలజీ, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫోర్ వీలర్ ఇంటర్‌సెప్టర్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న సాంకేతికతను, ఇప్పుడు సాధారణ బైక్‌లలోనూ అమర్చేందుకు వీలుగా దీనిని రూపొందించారు.

- Advertisement -

బైక్ ఇంటర్‌సెప్టర్’ ఫీచర్లు అదుర్స్ : ఈ బైక్‌ను ఓ కదిలే కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా చెప్పవచ్చు. దీనిలోని ఫీచర్లు అమోఘం.

రాడార్ వ్యవస్థ: ఈ బైక్‌లోని రాడార్, 700 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల వేగాన్ని కూడా కచ్చితంగా పసిగడుతుంది. అతివేగంతో వెళ్తున్న వారిని గుర్తించి, అడ్డుకోవడం సులభమవుతుంది.

హెచ్‌డీ కెమెరాలు: బైక్‌కు అమర్చిన హై-డెఫినిషన్ కెమెరాలు, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనం నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా ఫోటో తీస్తాయి.

ఆన్‌ ది స్పాట్ చలాన్: ఈ ఫోటోను నేరుగా కంట్రోల్ రూమ్‌కు పంపడంతో పాటు, బైక్ పైనుంచే ట్రాఫిక్ పోలీస్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సర్వర్‌కు కనెక్ట్ అయి, అక్కడికక్కడే చలాన్ జారీ చేయవచ్చు. ఆ చలాన్ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తాయి.

నిరంతర నిఘా: బైక్‌ను ఒకచోట పార్క్ చేసి ఉంచినా, దాని కెమెరాలు పరిసరాల్లోని వాహనాల కదలికలపై నిఘా పెట్టగలవు.

“రోడ్లను సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యం. ప్రజలు తొందరపాటుతో తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తుంటారు. ఇలాంటి వారిని ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పట్టేసే టెక్నాలజీ ఈ ‘బైక్ ఇంటర్‌సెప్టర్’‌లో ఉంది.”
– శివ కార్తికేయ, కంపెనీ ప్రతినిధి

టోల్‌గేట్ల వద్ద ఆగక్కర్లేదు: ఈ ఎక్స్‌పోలో మరో అద్భుతమైన టెక్నాలజీ ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో’. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా, గంటకు 100-120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నా, వాహనం నంబర్ ప్లేట్‌ను రీడ్ చేసి, ఆటోమేటిక్‌గా టోల్ రుసుమును వసూలు చేసే ఈ టెక్నాలజీ, భవిష్యత్తులో మన ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేయనుంది. ఈ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తే, ట్రాఫిక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు రావడం, రోడ్డు భద్రత మెరుగుపడటం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad