Friday, September 20, 2024
Homeనేషనల్BJP new strategy in Kerala: కేరళలో బీజేపీ కొత్త వ్యూహం

BJP new strategy in Kerala: కేరళలో బీజేపీ కొత్త వ్యూహం

క్రైస్తవ వర్గాలు బీజేపీకి సానుకూలంగా మారిన నేపథ్యంలో..

కేరళకు సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన త్రిచూర్‌ లో రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ సుమారు రెండు లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ రాష్ట్ర చరిత్రలో అరుదైన విశేషమే. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత మొదటిసారిగా కేరళ రాష్ట్రానికి వస్తున్న మోదీకి స్వాగతం చెబుతూ రాష్ట్ర బీజేపీ శాఖ ఈ రోడ్ షోను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభకు అంగన్వాడీ కార్యకర్తలు మొదలుకుని ఉపాధ్యాయులు, ప్రముఖుల వరకు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. రోడ్‌ షో, ఆ తర్వాత బహిరంగ సభంతా మోదీ, భారత్‌ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. నిజానికి ఈ రెండు నినాదాలు కేరళ రాజకీయ వాతావరణానికి ఏమాత్రం సరిపోవు. బహిరంగ సభకు ఈ విధంగా మహిళలు పెద్ద సంఖ్యలో రావడాన్ని మోదీ బాగా సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా మహిళా ప్రయోజనాలను కాపాడడంలో ఎల్‌.డి.ఎఫ్‌, యు.డి.ఎఫ్‌ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కేరళ ప్రజలు ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశమివ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
మహిళలను ఉద్దేశించి ఆయన అనేక వాగ్దానాలు చేశారు. మారుమూల గ్రామాలకు సైతం మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తా మని, సువిధా నాప్కిన్స్‌ పథకాన్ని ఇక్కడ మరింతగా విస్తరిస్తామని ఆయన వాగ్దానాలు చేశారు. అయితే, ఇక్కడ ఈ పథకాలన్నీ పూర్తి స్థాయిలో ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. కాగా, ఆయన 40 నిమిషాల ప్రసంగంలో బాగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశం క్రైస్తవులకు ఇచ్చిన ప్రత్యేక హామీలు. దేశవ్యాప్తంగా క్రైస్తవుల సంక్షేమానికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టమైన హామీ ఇస్తూ, ఈశాన్య రాష్ట్రాల్లో తాము క్రైస్తవుల కోసం ఎటువంటి పథకాలు చేపడుతున్నదీ వివరించారు. నిజానికి, గత వారం కొందరు క్రైస్తవ నాయకులు మోదీని ఆయన నివాసంలో కలిసినప్పుడు ఆయన క్రైస్తవులతో తమకున్న ‘పురాతన, హార్దిక, సన్నిహిత’ సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయిన క్రైస్తవ నాయకుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారే కావడం విశేషం.
ఇక 2016 శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలుచుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీ ఇంత వరకూ ఖాతా ప్రారంభించడం జరగలేదు. ఈ పరిస్థితి నుంచి బీజేపీ బయటపడాలన్న పక్షంలో క్రైస్తవులను ఆకట్టుకోవడం తప్ప మార్గం లేదని మోదీకి బాగా తెలుసు. రాష్ట్ర జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న క్రైస్తవులు రాజకీయంగా, ఆర్థికంగా బాగా బలపడి ఉండడం వల్ల రాష్ట్ర రాజకీయాలపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా ఏళ్లుగా వీరంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండడం జరుగుతోంది. అయితే, కొద్దికాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం క్షీణిస్తుండడంతో క్రైస్తవుల్లో ఎక్కువ మంది వామపక్షాల వైపు మొగ్గు చూపడం జరుగుతోంది. అయితే, ఇందులో కూడా అంతర్గత వైరుధ్యాలు అనేకం ఉన్నాయి. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల తర్వాత క్రైస్తవులు కొద్దిగా బీజేపీకి అనుకూలంగా మారడం ప్రారంభించారు. కానీ, వారి అనుకూలత పూర్తి స్థాయిలో ఓట్లుగా మాత్రం మారలేదు. అది జరగాలన్న పక్షంలో బీజేపీకి ఇక్కడ బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఇక్కడ సరైన నాయకులను, సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోగలిగే పక్షంలో సమీప భవిష్యత్తులో తప్పకుండా రాజకీయ ప్రయోజనాలు పొందగలుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News