దేశంలోని విపక్షాలు చాలా అరుదుగా ఒకే తాటిపైకి వస్తుంటాయి. అలాంటి అరుదైన రోజుగా ఈరోజు రాజకీయాల్లో ముఖ్యమైన రోజుగా మారింది. ఓవైపు పార్లమెంటు సమావేశాల్లో మూకుమ్మడిగా ప్రభుత్వంపై మాటల దాడి చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు కలుపుతుండటం విశేషం. విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈరోజు వివిధ ప్రతిపక్ష పార్టీలు బ్లాక్ ప్రొటెస్ట్ ను తలపెట్టాయి. అనూహ్యంగా ఈ నిరసన కార్యక్రమాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం కానుండటం విశేషం. రాహుల్ పై అనర్హత వేటు పడటం అన్ని విపక్ష పార్టీల్లో ఐక్యతకు దారితీసినట్టు స్పష్టమవుతోంది. నల్ల దుస్తులతో కాంగ్రెస్ సభ్యులంతా ఈరోజు సభకు హాజరయ్యారు.
మొత్తం 17 విపక్ష పార్టీలు ఇలా నిరసనల్లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, బీఆర్ఎస్, జేడీయూ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, ఐయుఎంఎల్, ఎండీఎంకే, కేసీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, ఏఏపీ, ఎన్ సీ, శివసేన (ఉద్ధవ్ వర్గం) ఈ నిరసనలకు దిగాయి.
నిజానికి రాహుల్ పై అనర్హత వేటు పడిన అంశంపై తృణముల్ పార్టీ ఒక్కటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించినప్పటికీ తన ప్రధాన ప్రతిపక్షమైన లెఫ్ట్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ వెంట దీదీ పార్టీ నడిచేలా సిద్ధమవ్వటం మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతోంది.