Bombay High Court: విడాకుల పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి ఒప్పుకోకపోవడం.. వివాహేతర సంబంధాలు ఉన్నాయని భర్తని అనుమానించడం క్రూరత్వంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. భార్య నుంచి విడాకులు కోరాలంటే ఇలాంటి కారణాలు ఉన్నా సరిపోతుందని వ్యాఖ్యానించింది. అయితే ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులపై ఓ మహిళ హైకోర్టుకు ఆశ్రయించడంపై న్యాయస్థానం ఈ విధంగా పేర్కొంది.
ఏం జరిగిందంటే?
2013లో ఓ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత నుంచి ఇరువురు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే భార్య శృంగారానికి నిరాకరించడం సహా తనపై అక్రమ సంబంధాలున్నట్లు అనుమానిస్తుందని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందరిముందు
అవమానిస్తూ మానసికంగా వేధిస్తుందని భర్త ఆరోపించారు. తన భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత తనను పట్టించుకోవడం మానేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఆ భర్త 2015లో విడాకుల కోసం పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆ జంటకి విడాకులకు మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ.. అతని భార్య బొంబాయి హైకోర్టుకు వెళ్లింది. అత్తమామలు తనను వేధించారని.. అయితే భర్తపై తనకు ఎంతో ప్రేమ ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. అయితే విడాకులు వద్దని ఆమె అందులో పేర్కొంది. కానీ, ఆశ్చర్యకంగా తనకు నెలవారి లక్ష రూపాయలు భరణం ఇవ్వాలని ఆమె కోర్టుకు విన్నవించుకుంది. దీనిపై విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విడాకులు మంజూరు సబబేనని ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యలను సమర్ధించింది.


