Sunday, October 6, 2024
Homeనేషనల్BRS Nanded: రైతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది: కేసీఆర్

BRS Nanded: రైతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది: కేసీఆర్

దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నాక, దేశ భావజాలాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేయాలని మేం నిర్ణయించుకున్నామని బీఆర్ఎస్ ఆవిర్భావం వెనుకున్న కారణాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ప్రజల ముందుకు వచ్చిందని కేసీఆర్ సగర్వంగా వెల్లడించారు. దేశంలో రైతుల సంఖ్య జనాభాలో 42 శాతం కంటే అధికంగా ఉందని, వ్యవసాయ కార్మికులను కూడా కలిపితే ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దీని కన్నా బలం అవసరం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. మనం హలాన్ని (నాగలిని) పట్టి, కలాన్ని వేరే వాళ్లకు అప్పగించామని రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు కలాన్ని పట్టి, చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలని ఆయన గర్జించారు. రైతులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవ్వాలని.. అప్పుడే రైతు రాజ్యం నిర్మితమవతుందన్నారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీలు గెలుస్తాయి.. రాజకీయ నాయకులు గెలుస్తారు కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, రైతులు గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవంతో తాను చెబుతున్నానని.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఎన్నో పదవులు చేపట్టిన తాను అనుభవంతో చెప్పే మాట ..భారతదేశం అమెరికా కంటే ధనవంతమైన దేశమని అంటూ కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో కాంగ్రెస్ 54 సంవత్సరాలు పాలించిందని.. బీజేపీ 16 సంవత్సరాలు పాలిస్తే… విపి సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ వంటి నాయకులు సంవత్సరం, సంవత్సరంన్నర ఎనిమిది నెలలు పాలించి నిష్క్రమించారని గుర్తుచేశారు.

మోడీ తెచ్చిన మేకిన్ ఇండియా … జోకిన్ ఇండియాగా మారి.. మేకిన్ ఇండియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. మన్ కీ బాత్, ఈ బాత్, ఓ బాత్ అంటూ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్యపెడతారు ?

కిసాన్ సర్కార్ వస్తేనే దేశం పురోగమిస్తుందని..దేశం తన లక్ష్యాన్ని కోల్పోయి.. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. నాయకులు మారుతున్నా ప్రజల పరిస్థితి ఎందుకు మారటం లేదని కిసాన్ సర్కార్ ను ఎన్నుకుంటే రెండు సంవత్సరాల్లో వెలుగు జిలుగుల భారత్ ను నిర్మిస్తామని భరోసా ఇచ్చారు కేసీఆర్.

బీఆర్ఎస్ వస్తే..

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు, కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున దళితబంధును అందిస్తామని, రైతుబంధును ప్రతీ రాష్ట్రంలో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. 8-10 రోజుల్లో ప్రతీ గ్రామానికి బీఆర్ఎస్ వాహనం చేరుకుని.. అన్ని కమిటీలు ఏర్పడతాయన్నారు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు అంటూ కేసీఆర్ ప్రసంగం ఉత్కంఠ భరితంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News