Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్‌లో సంభవించిన అకస్మిక భారీ వర్షాలు, మెరుపు వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తగా, వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఈ వరదల దెబ్బకు ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, సుమారు 10 మంది సైనికులు కూడా వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ధరాలీ గ్రామానికి సమీపంలోని హర్షిల్ ఆర్మీ క్యాంప్‌కు దిగువన ఉన్న సైనికులు ఈ వరదలో గల్లంతయ్యారు. సైన్యం వారి కోసం గాలింపు చర్యలను చేపట్టింది.
అడుగుల మేర బురద, రంగంలోకి సైన్యం..
ధరాలీ గ్రామంలో బురద.. అడుగుల మేర భారీగా పేరుకుంది. ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. 150 మంది సభ్యులతో కూడిన సైన్య బృందం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి సహాయక చర్యలను కొనసాగిస్తోంది. అయినప్పటికీ, బురద, శిథిలాలు సహాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/former-governor-satyapal-passes-away/
కొట్టుకుపోయిన కారు
ధరాలీలోని ఓ కాలువలో కారు కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి.
ఎయిర్ ఫోర్స్ సన్నద్ధం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సహాయక చర్యలకు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఛండీగఢ్ ఎయిర్‌బేస్ నుంచి చినూక్, ఎంఐ-17 వీ5, చీతా, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను స్టాండ్‌బైలో ఉంచి, అవసరమైన సహాయ సామగ్రిని సిద్ధం చేసింది.


