Sunday, November 16, 2025
Homeనేషనల్Chhath Puja Begins: 36 గంటల నిర్జల దీక్ష.. అర్చకులు లేని ఆరాధన! ఛఠ్ పూజ...

Chhath Puja Begins: 36 గంటల నిర్జల దీక్ష.. అర్చకులు లేని ఆరాధన! ఛఠ్ పూజ మహాపర్వం ప్రారంభం!

Significance of Chhath Puja : సూర్యుడే ప్రత్యక్ష దైవంగా.. ప్రకృతియే దేవతగా.. అర్చకులు, మంత్రతంత్రాలు లేకుండా, కేవలం అచంచలమైన భక్తితో, కఠోరమైన దీక్షతో జరుపుకునే పండుగే ‘ఛఠ్ పూజ’. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బిహార్, ఝార్ఖండ్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ నాలుగు రోజుల మహాపర్వం, శనివారం ‘నహయ్-ఖయ్’తో ప్రారంభమైంది. మహిళలు ఏకంగా 36 గంటల పాటు నీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండటం ఈ పండుగ ప్రత్యేకత. అసలు ఏమిటీ ఛఠ్ పూజ? దీని వెనుక ఉన్న పురాణ, శాస్త్రీయ రహస్యాలేంటి?

- Advertisement -

ఏమిటీ ఛఠ్ పూజ : ఛఠ్ పూజ, సూర్యభగవానుడికి, ఆయన సోదరిగా భావించే ఛఠీ మాతకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఏటా కార్తీక మాస శుక్లపక్ష షష్ఠి నాడు ఈ వేడుకలు జరుగుతాయి. రుగ్వేదంలో సైతం సూర్యారాధన గురించి ప్రస్తావన ఉందని, ఆ పురాతన సంప్రదాయానికి ఈ పండుగ సజీవ ఉదాహరణమని పండితులు చెబుతున్నారు.

నాలుగు రోజుల నిష్ట.. కఠోర దీక్ష : ఈ పండుగను నాలుగు రోజుల పాటు అత్యంత నిష్టగా ఆచరిస్తారు.
1వ రోజు (నహయ్-ఖయ్): శనివారం, భక్తులు నదీ స్నానం చేసి, ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండిన సాత్విక భోజనం (సొరకాయ కూర, అన్నం) స్వీకరించి, దీక్షకు సిద్ధమవుతారు.
2వ రోజు (ఖర్నా): ఆదివారం, రోజంతా ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత బెల్లం, పాలతో చేసిన ఖీర్ (పాయసం) తిని, 36 గంటల సుదీర్ఘమైన, కఠోరమైన నిర్జల ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు.
3వ రోజు (సంధ్యా అర్ఘ్య): సోమవారం, సాయంత్రం వేళ, నదులు లేదా చెరువులలో నడుము లోతు నీటిలో నిలబడి, అస్తమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు.
4వ రోజు (ఉష అర్ఘ్య): మంగళవారం, ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడంతో ఈ కఠిన దీక్ష ముగుస్తుంది.

అర్చకులు లేరు.. ముహూర్తాలు లేవు : ఈ పూజకు అర్చకుడు, పురోహితుడితో పనిలేదు. భక్తులే నేరుగా సూర్యభగవానుడితో తమ అనుబంధాన్ని చాటుకుంటారు. సూర్యాస్తమయ, సూర్యోదయ సమయాలనే శుభ ముహూర్తాలుగా భావిస్తారు.

ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు : ఈ ఆచారాల వెనుక లోతైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

“మొదటి రోజు తినే సొరకాయలో 95% నీరు ఉంటుంది. ఇది 36 గంటల ఉపవాసంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. సూర్యారాధన వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుంది. ఈ పండుగ మానవులను ప్రకృతితో ఏకం చేసే ఓ తపస్సు.”
– హృదయ్ నారాయణ్ ఝా, జానపద సాహిత్య పండితుడు

ఈ పండుగ కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదు. అమెరికా, లండన్, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా, తమ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ, ఛఠ్ పూజను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad