Perennial Rice: మన తెలుగు రాష్ట్రాలలో పండే వరి పంట గురించి అందరికీ తెలిసిందే. వరిని ఎలా వేస్తారు.. ఎలా కోస్తారు.. ఎలా పంట నూర్పిడి చేస్తారు.. ఇలా అన్నీ మనకు తెలిసిందే. ఇందులో రకరకాల వరి వంగడాలు ఉండగా.. సన్నరకాలు.. మధ్య రకాలు.. లావు రకాలు మనకి బాగా పరిచయం. ఇవన్నీ దాదాపుగా 70 రోజుల నుండి 6 నెలల వరకు పంట కాలంలో పండే రకాలు. అయితే, చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా నాలుగేళ్ల పాటు ఉండేలా ఒక వరి రకాన్ని డెవలప్ చేస్తున్నారు.
చైనా శాస్త్రవేత్తలు ఒక్కసారి నాటితే నాలుగేళ్ల పాటు దిగుబడి ఇచ్చేలా అభివృద్ధి చేసిన ఈ కొత్తరకం వరి వంగడాలను నాలుగేళ్ల క్రితమే అక్కడి రైతులకు అందించగా.. ఇప్పుడు ఆ రైతులు ఈ వంగడాలతో పంటను కూడా పండిస్తున్నారు. పీఆర్ 23 పేరుతో బయటకొచ్చిన ఈ వరి ఒక్కసారి నాటితే ఏడాదికి రెండుసార్లు చొప్పున నాలుగేళ్ల పాటు ఎనిమిది సార్లు కోత కోసుకొని నూర్పిడి చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ రకం వరిసాగులో ప్రతిసారి ఎకరాకు 27 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ అక్కడి రైతులు సంతోషంగా ఉన్నారట. ప్రతిసారి పంట వేయడమే వరిసాగులో పెద్ద సమస్య. ముందుగా విత్తనాలను నారుమడిలో పెంచి.. ప్రధాన పొలంలో నాటు వేసి కలుపు నివారించడం పెద్ద టాస్క్. అయితే.. ఈ చైనా వరిలో ఒక్కసారి ఈ వరినాటు వేస్తే.. నాలుగేళ్ళ పాటు వరికోత, పంట నూర్పిడి మాత్రమే చేసుకోవాలి. మరి మన దేశంలో ఈ తరహా వరిసాగు ఎప్పటికి వస్తుందో చూడాలి.