Sunday, July 14, 2024
Homeనేషనల్CM Revanth met Amit Shah: తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి

CM Revanth met Amit Shah: తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి

అద‌న‌పు ఐపీఎస్ పోస్టుల మంజూరు చేయండి

రాష్ట్ర స్థాయి అత్యున్న‌త నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం క‌లిశారు. సుమారు గంట‌పాటు కొన‌సాగిన భేటీలో వివిధ అంశాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. భేటీలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు. డ్రగ్స్ మరియు సైబర్ నేరాల‌ నియంత్రణ‌తో పాటు అరికట్టడానికి కావ‌ల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, ప‌రిక‌రాల‌ కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి కోరారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసర‌ని, తెలంగాణ‌కు సంబంధించి 2016లో మొదటి సారి సమీక్ష నిర్వహించార‌ని, నాటి నుంచి స‌మీక్ష చేయ‌నుందున వెంట‌నే స‌మీక్ష చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించార‌ని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌లు సరిపోనందున‌, తెలంగాణ‌కు అద‌నంగా మరో 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు.

  • తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విష‌యాన్ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన క్యాంపులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంద‌న్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గ‌తంలో ఉండి తొల‌గించిన మూడు జిల్లాల‌ను ఎస్ఆర్ఈ కింద‌ (భ‌ద్ర‌తాప‌ర‌మైన వ్య‌యం, చెల్లింపులు) తిరిగి కొన‌సాగించాల‌ని కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాల‌మైన సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  
  • తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో  సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్ గ‌ఢ్ సరిహద్దుల్లోని కర్రె గుట్టల కొండ‌ల్లో ఉన్న అనుకూల‌త‌ను ఆస‌రాగా చేసుకొని సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి త‌మ ప్రాబ్య‌ల విస్త‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టు ప్రత్యేక దళం కద‌లికల నియంత్ర‌ణ‌తో పాటు నిర్మూల‌న‌కు జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడ‌తాయ‌ని తెలిపారు. ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉంద‌ని,
    ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు.  మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన స‌మాచారం చేర‌వేత‌కు ఇబ్బందిగా ఉంద‌న్నారు. 1065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులు అందుబాటులో లేర‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.
  • పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం…
    దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. షెడ్యూల్ 9లోని (చ‌ట్టంలోని 53, 68, 71 సెక్ష‌న్ల ప్ర‌కారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ప‌దిలోని సంస్థ‌ల వివాదం (చ‌ట్టంలోని 75 సెక్ష‌న్ ప్ర‌కారం) సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు. పునర్విభజన చట్టంలో ఎక్క‌డా ప్రస్తావించని ఆస్తులు,సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, అందులో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News