ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై విదేశాల్లో నిషేధం
- హాంకాంగ్, సింగపూర్ నుంచి చుక్కెదురు
- యాంటీబయాటిక్స్, రసాయనాల అతి వాడకం
- ప్రజారోగ్యానికి ప్రమాదకరమన్న వాదనలు
- రంగంలోకి దిగిన కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)
మన దేశంలో ఎంతో పేరు పొందిన మసాలాలు.. ఎండీహెచ్, ఎవరెస్ట్. రసం, సాంబారు నుంచి కూరల్లో ఉపయోగించే మసాలా పౌడర్ల వరకు ప్రతి ఒక్కటీ ఈ బ్రాండ్లకు చెందినవే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ దుకాణానికి వెళ్లినా, సూపర్ మార్కెట్లు చూసినా, డీమార్ట్ లాంటి వాటికి వెళ్లినా అక్కడ ముందుగా కనిపించేవి ఇవే. మన దేశంలోని ప్రతి ఇంట్లో దాదాపుగా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. విదేశాలకు కూడా గణనీయంగా ఎగుమతి అవుతున్నాయి.
ఇదంతా నాణేనికి ఒకవైపు
రెండోవైపు చూస్తే, ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు చెందిన కొన్ని మసాలా దినుసులను వాడొద్దని హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. సింగపూర్‌లోనూ ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన ‘సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ’ (సీఎఫ్ఎస్) చెప్పింది. ఇథలీన్ ఆక్సైడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్న మాట. హాంకాంగ్, సింగపూర్.. ఈ రెండు దేశాల్లోనూ ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగం వాళ్లు మన మసాలా దినుసుల నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపారు. వాటిలో ఇథలీన్ ఆక్సైడ్ ఉందని తేలింది. దాంతో మార్కెట్ నుంచి మొత్తం ఈ మసాలాలను ఉపసంహరించాలని ఆయా దేశాలు ఆదేశించాయి.
సాధారణంగా ఈ ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ కొద్దిగా ఉంటే వెంటనే ప్రమాదం లేదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. అయితే, దీర్ఘకాలం వాడితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆదేశాల తర్వాత ఎవరెస్ట్ సంస్థ వివరణ ఇచ్చింది.”మా ఉత్పత్తులన్నీ అత్యంత కఠినమైన నాణ్యతా పరీక్షల తర్వాత తయారవుతాయి, ఎగుమతి అవుతాయి. మాది యాభై ఏళ్ల నాటి, ప్రసిద్ధ బ్రాండ్. మేం పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తాం. మా ఉత్పత్తులకు ఇండియన్ స్పైస్ బోర్డ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సహా అన్ని ఏజెన్సీల నుంచి ఆమోదం ఉంది. ప్రతి ఉత్పత్తినీ ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. మా నాణ్యత నియంత్రణ బృందం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది” అని ఎవరెస్ట్ కంపెనీ చెప్పింది.
ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?
ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రంగులేని, మండే గుణం ఉన్న వాయువు. దీనిని సాధారణంగా వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందులు, స్టెరిలెంట్‌ల తయారీలలో ఉపయోగిస్తారు. సూక్ష్మజీవుల కాలుష్యాన్ని తొలగించడానికి, కీటకాలను నియంత్రించడానికి సుగంధ ద్రవ్యాలు, ఇతర పొడి ఆహారాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడతారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి ఉపయోగిస్తుంటారు. కానీ, దీనివల్ల క్యాన్సర్ వస్తుందని పలు రకాల పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ రెగ్యులేటరీ సంస్థలు ఆహార పదార్థాల్లో దీని వాడకంపై నిషేధం, లేదా కఠిన నిబంధనలు విధించాయి. దీని పరిమాణం ఎంత ఉండాలనే దానిపై కొన్ని దేశాల్లో చట్టాలు కూడా చేశారు.
అమెరికాలో కూడా..
ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ 2023లో ఆదేశించింది. వీటిలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి.
కేంద్రం ఏమంటోంది?
విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలను మన దేశంలో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన నాలుగు మసాలా ఉత్పత్తుల నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. 2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలా ఉత్పత్తులను తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఎవరెస్ట్ తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాల గురించి పెదవి విప్పలేదు. ఈ కంపెనీకి చెందిన మొత్తం 60 రకాల ఉత్పత్తుల్లో ఒక ఫిష్ కర్రీ మసాలాను మాత్రమే పక్కన పెడుతున్నట్లు పేర్కొంది.
ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీలకు చెందిన అన్నిరకాల మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి క్షుణ్ణంగా పరీక్షించాలని ఫుడ్ కమిషనర్లను కేంద్రం తాజాగా ఆదేశించింది. మూడు నాలుగు రోజుల్లోనే దేశంలో అన్ని యూనిట్ల నుంచి నమూనాలు సేకరిస్తారని, ఆపై వాటిని పరీక్షిస్తారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. కేవలం ఈ రెండు కంపెనీల నుంచే కాదని, దేశంలని అన్ని మసాలా దినుసుల కంపెనీల నుంచి నమూనాలు సేకరిస్తారని, అయితే వీటి పరీక్ష ఫలితాలు రావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పారు.
గతంలో రొయ్యల్లో యాంటీబయాటిక్స్
మన దేశం నుంచి విస్తృతంగా ఎగుమతి అయ్యే రొయ్యల విషయంలో కూడా అనేక వివాదాలు తలెత్తాయి. చైనా, అమెరికా లాంటి దేశాలకు పంపిన రొయ్యల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయని ఏకంగా ఒక కన్‌సైన్‌మెంట్ మొత్తాన్ని తిప్పి పంపారు. రొయ్యలు అతి తక్కువ సమయం మాత్రమే నిల్వ ఉంటాయి. అలా తిప్పి పంపడంతో ఉత్పత్తిదారులకు భారీ నష్టం వాటిల్లింది. రొయ్యల పెంపకంలో వైరస్‌లను నివారించేందుకు పలు రకాల మందులు వాడతారు. వాటిలో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అవి ఎక్కువ మోతాదులో ఉండటంతో విదేశాల్లో వాటిని తిరస్కరించారు.