Sunday, May 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra concluded: ముగిసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Jagan bus yatra concluded: ముగిసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

టెక్కలిలో బహిరంగ సభతో ముగింపు

22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్ర. ఈ యాత్రలో సీఎం జగన్ 16 బహిరంగ సభల్లో పాల్గొని, 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షో లలో పాల్గొన్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్ యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది.

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నముఖ్యమంత్రి వైయస్.జగన్

ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:

ఈ జనం అభివృద్ధిని కాపాడుకునే సిక్కోలు సింహాలు
టెక్కలిలో శ్రీకాకుళం జిల్లా సిద్ధం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తున్న ఈ జనసముద్రాన్ని చూస్తుంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సిక్కోలు సింహాలు. ఈ విప్లవ గడ్డ మీద ఆ పెత్తందార్ల ముఠా మీద ఎగరవేస్తున్న విప్లవ బావుటా ఇక్కడ కనిపిస్తోంది.

అడుగడుగునా జనసముద్రం
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా కూడా జనసముద్రం. వైయస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారిపొడువునా కూడా జనసునామీ చూస్తుంటే 25కు 25 పార్లమెంటు స్థానాలు, 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?

ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాలా లేదా వద్దా అని నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతున్న ఈ కురుక్షేత్రం.

జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతున్నాను. జగన్ ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం.. తలపడుతున్న ఈ యుద్ధం, కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప చెళ్లుమనేలా సమాధానం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా?

సామాన్య ప్రజల గుండె చప్పుడు సిద్ధం
సిద్ధం సిద్ధం.. అంటే పొత్తుల జిత్తులకు, జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారో, ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు, పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది కేవలం ఈ మూడు నాలుగు నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు. ఇది ఓ 25 సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు. ఇది మనందరి ప్రభుత్వం ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం.

మీరే గమనించండి. మన సమాజంలో ప్రతి రంగాన్నీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొట్ట మొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించండి అని మిమ్మల్నందరినీ కూడా కోరుతున్నాను. చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే ఎప్పుడూ చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం.

బడి సిద్ధం- అసుపత్రి సిద్ధం
ఈ 58 నెలల్లోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆస్పత్రి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏ గ్రామాన్నయినా, ఏ పట్టణమైనా ఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్లు ప్రతి 2 వేల జనాభాకు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మనగ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లోనే సిద్ధం.

ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవుదినమైనా కూడా ఇంటికే వచ్చి రూ.3 వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం.

మీ బిడ్డకు మీరే సైన్యంగా సిద్ధం
ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ.. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలో కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి, చెప్పి, ఆ అవసరాన్ని చెప్పే సభే, అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం.

ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసే గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతికి సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి, ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టో పంపి, ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికీ అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు నోరెత్తి అడగలేని పేదవాడికి, పేద సామాజిక వర్గాలను, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సాధికారత దిశగా వారందరినీ చేయిపట్టుకుని నడిపించే ఘట్టమే ఈ సిద్ధం.

కాబట్టే ఇంతగా సిద్ధమైన సమాజంతో మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తోంది ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తుంటే. ఈ చంద్రబాబు తాను ఇలాంటి నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వాళ్ల చానళ్లలో, వాళ్ల పత్రికలో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడం ఇది గొప్ప రాజకీయం అవుతుందా? అన్నది ఆలోచన చేయమని కోరుతున్నాను.

మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్న కనీసం ఆత్మవిమర్శగానీ, టీడీపీ గానీ, బాబు గానీ, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా గానీ ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే దాని అర్థం ఏమిటి? ప్రభుత్వం ఎవరి కోసం? అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని 5 ఏళ్లు వంచించడానికి, ఆ వచ్చిన అధికారంతో ప్రజల్ని లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట. గమనించమని మిమ్మల్నందరినీ కోరుతున్నాను.

మీ బిడ్డ పాలనలో నవ సమాజ నిర్మాణం
అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తున్న సమాజం ఎలాంటిదంటే ఇక ఏ పిల్లవాడూ, ఏ ఒక్క పాపా తన కులం వల్లనో, మతం వల్లనో, ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదవలేకపోయాను అని అనుకోవడానికి వీల్లేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులకు ఓ రకమైన చదువు, పేద వాళ్ల పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తున్నాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను.

రైతు, వ్యాపారి, కూలీ, నిరుపేదకు నమ్మకమిచ్చిన ప్రభుత్వమిది
ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, పేద సామాజికవర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, మంచి చేస్తుందన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ 58 నెలలుగా మీ బిడ్డ అందిస్తున్నాడు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆలోచన చేయమని అడుగుతున్నాను. 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? అని అడుగుతున్నాను. మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన పేదవాడి కోసం చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకువస్తుందా?

మరోవంక మీ బిడ్డ కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడూ సాకులు వెతుక్కోలేదు. సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, బతుకులు బాగుండాలి అని వాళ్ల కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కవ అని భావించి ఏరోజూ సాకులు చూపలేదు. బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా చెబుతున్నాను.

కాబట్టే మీ జగన్ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశానన్న ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా తలెత్తుకొని మీ మఅందరి ముందు నిలబడ్డాడు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలూ మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడామీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు. దాన్ని బంగారం అని నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగా ఉన్నాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు. ఏమి ఇచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికీ ఇది ఇచ్చాను, అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు.

ప్రతి పేద ఇంట్లో జగన్ మార్కు కనిపిస్తుంది
మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి ప్రతి అక్కచెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అవ్వాతాతల ఆనందంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ఆ అక్కచెల్లెమ్మల పిల్లల్లో, ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఒక్కటే గుర్తుంచుకోండి. జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు, ఇది నిజం, ఇది మాత్రమే నిజం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. అందుకే చెబుతున్నాను.

జగన్ చేయలేని ఏ స్కీంనూ బాబు జేజెమ్మ కూడా చేయలేడు
జగన్ చేయలేని ఏ స్కీమునూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు మోసాలతో, అబద్ధాలతో, వెన్నుపోట్లతో ఎవరితోనైనా, ఏ స్థాయికి అయినా కూడా వెళ్లి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్ని అయినా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా?

నేను ఈరోజు మీ అందరినీ అడుగుతున్నాను. ప్రతి అన్ననూ, ప్రతి అక్కనూ అడుగుతున్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు, వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను.

మోసాల బాబు కావాలా? విశ్వసనీయత ఉన్న జగన్ కావాలా?
మూడు సార్లు సీఎంగా ఉండి, 14 ఏళ్లు సీఎంగా చేసి కూడా ఏ పేదకూ ఏ మంచీ చేయని నాయకుడు కావాలా? లేక 58 నెలల్లోనే విప్లవాత్మక మార్పులతో మంచి చేసి ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా? అని ఆలోచన చేయమని కోరుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక మంచి చేసి చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా?

నాయకుడు అంటే కార్యకర్త కాలర్ ఎగరేసేలా ఉండాలి
మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తలెత్తుకుని గర్వంగా ఇదిగో ఇవి చెప్పాడు, ఇదిగో ఇవన్నీ చేశాము అని ప్రతి ఇంటికీ వెళ్లి గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా? లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసకారి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను.

ఆ నాయకుడు ఏరకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగరేసుకుని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్తా, ప్రతి వాలంటీర్, ప్రతి అభిమానీ తిరగగలిగే పరిస్థితి ఉంటుందన్నది ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నాను. మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి? బాబు ఏం చెప్పాడు, ఏం చేశాడు. గతంలో 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అంటూ ఇదే ముగ్గురి ఫొటోలతో ఆయన ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? కనిపిస్తున్నాయా ఈ ఫొటోలు? చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడు, దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. కింద చంద్రబాబు సంతకం కూడా కనపడుతోందా? ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారో అని టీవీల్లో అడ్వర్టైజ్ మెంట్లు ఊదరగొట్టారు గుర్తుందా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లు గుర్తున్నాయా? ఈ పాంప్లెట్ లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదవమంటారా? అన్నా, అక్కా, తమ్ముడూ చదవమంటారా?

అమలు కాని చంద్రబాబు హామీలు…
ముఖ్యమైన హామీల్లో మొట్ట మొదటిది రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేశాడా? ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.14205 కోట్లు.. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడ బిడ్డ పుట్టిన వెంటనే అక్కా వినండక్కా.. మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. రూ.25 వేలు కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికీ రూ.2వేలు ప్రతి నెలా నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు 60 నెలలు నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను.

ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్లస్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. 3 సెంట్ల స్థలం కథ దేవుడెరుగు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా స్థలం ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఎందుకంటే ఇవన్నీముఖ్యమైన హామీలట. చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి వాళ్ల ముగ్గురి ఫొటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లోని ముఖ్యమైన హామీలు. కాబట్టి ముందుకు పొమ్మంటారా? అక్కా, అన్నా ముందుకు పొమ్మంటారా?

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మీ టెక్కలిలో ఏమైనా కనిపిస్తోందా? పోనీ శ్రీకాకుళంలో ఏమన్నా కనిపిస్తోందా? ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా? పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? ఇవ్వకపోగా.. ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి, ఇదే చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మళ్లీ ఏమంటోంది? ఈరోజు మళ్లీ సూపర్ సిక్స్ అట, సూపర్ సెవెన్ అట, ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారట. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? అక్కా నమ్ముతారా?

టీడీపీ, ఎల్లో మీడియా చీకటిపై యుద్ధానికి సిద్ధమా?
మరి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమే అయితే, వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లోంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తు కోసం యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలాన్నా, పేద వాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా, మన పిల్లలు, మన పిల్లల బడులు బాగు పడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేసి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు కూడా వీల్లేదు. సిద్ధమేనా?

హీరో ఎవరో ? విలన్ ఎవరో? ఆలోచన చేయండి
ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో ఒకే ఒక్క ఆలోచన మీ మెదడులో వేస్తున్నాను. మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు. విలన్ ఎవడో తెలియదు. కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు. మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. కారణం.. ఆ హీరో తన గుణ గణాలు తాను చేసే మంచి, తాను వేసే అడుగుల వల్ల ఆ హీరో మా హీరోఅని చెప్పి మన వాడు అనుకుంటాం. అదే విలన్ ఆయన చేసే మోసాల వల్ల, ఆయన చేసే అబద్ధాలు, కుట్రల వల్ల ఆ ఫలానా క్యారెక్టర్ విలన్ అని అంటాం. అవునా? కాదా?

ఆలోచన చేయండి ఈరోజు నిజజీవితంలో కూడా రాజకీయాల్లో హీరో ఎవడు? విలన్ ఎవడు అన్నది ఆలోచన చేయండి.

ఇంట్లో పిల్లలతో సైతం చర్చించి నిర్ణయం తీసుకొండి
ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో కూర్చోండి. భార్యా బిడ్డలతో మాట్లాడండి. చిన్న పిల్లలని చెప్పి మాట్లాడకుండా వదిలేయొద్దండి. చిన్న పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్నఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకుని ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం వారితోనే అడుగులు ముందుకు వేయండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను.

మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.
మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తున్నాను. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలక్ ను పరిచయం చేస్తున్నాను. మీ టెక్కలి నియోజకవర్గమే. మంచివాడు, యువకుడు, సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. మంచి చేసే అవకాశం మీరు తిలక్ కు ఇవ్వండి. మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తిలక్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

ఇదే టెక్కలి నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శీను నిలబడుతున్నాడు. మీ అందరికీ తెలిసినవాడు. శీను ఎలాంటివాడు, శీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరినీ నేను హామీ ఇస్తున్నా. ఒక్కసారి మార్చండి. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న చెడుకు ఒక్కసారి మార్పు ఇవ్వండి. మంచి చేసి చూపిస్తాడు శీను. శీనుతో మంచి నేను చేయిస్తాను అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. శీనుపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

ఆముదాలవలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్ గా కూడా తాను ఇవాళ ఉన్నాడు. తమ్మినేని సీతారామ్ అన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

పలాస నుంచి అప్పలరాజును పోటీలో పెడుతున్నాం. డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తే, ఒక్కోసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తున్నాను.

పాతపట్నం నుంచి శాంతమ్మ నిలబడుతోంది. నా చెల్లెలు నిలబడుతోంది. మీ అందరికీ మంచి చేస్తుంది. సౌమ్యురాలు, మంచి ఆవిడ. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో వేడుకుంటున్నాను.

ఇచ్ఛాపురం నుంచి నా మరోచెల్లి విజయమ్మ నిలబడుతోంది. మంచి చేస్తుంది. మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తోంది. మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

నర్సీపట్నం నుంచి కృష్ణదాస్ అన్న నిలబడుతున్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆరోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరఫున నాకు తోడుగా నిలిచిన మొట్ట మొదటి చేయి కృష్ణదాస్ అన్నే. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తున్నాను.

శ్రీకాకుళం నుంచి ధర్మాన(ధర్మాన ప్రసాదరావు) అన్న నిలబడుతున్నాడు. నాకు తండ్రిలాంటివాడు. మంచి చేస్తాడు. సౌమ్యుడు. మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

మన గుర్తు అక్కడో, ఇక్కడో, ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా మన గుర్తు ఫ్యాను గుర్తు. అక్కా మన గుర్తు ఫ్యాను అక్కా. ఆ అక్క వెనకాలు ఉన్న అవ్వా మన గుర్తు ఫ్యాను అవ్వా. అన్నా మన గుర్తు ఫ్యాను అన్నా. మన గుర్తు ఫ్యాను తమ్ముడూ. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని ఫ్యాను మీద రెండు ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తూ.. ఒకసారి అలా వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్నవిస్తున్నాను. అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News