దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్‌ఎ వద్ద ఉన్న ప్రముఖ Delhi Haat మార్కెట్లో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 26 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే, 14 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి.
సకాలంలో స్పందనతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో మార్కెట్లో పెద్దగా జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. కానీ కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి కపిల్ మిశ్రా సంఘటన స్థలానికి చేరుకొని బాధిత వ్యాపారులను పరామర్శించారు. ప్రభుత్వ తరఫున సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఫుడ్ ప్లాజా సమీపంలోని కొన్ని ఇతర షాపులు కూడా ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయినట్టు వెల్లడించారు.
మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిసింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కొన్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంతో, మళ్లీ ఇలా జరగడం పలువురిలో ఆందోళన కలిగించింది. Delhi Haat వంటి ప్రసిద్ధ మార్కెట్ స్థలాల్లో భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉండాలన్న కోరనలు వినిపిస్తున్నాయి.