Maharashtra Political Dynamics: మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక సంచలనాలకు తెర తీస్తూనే ఉంటది. తాజాగా బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. దశాబ్దాలుగా విడిపోయి ఉన్న ఠాక్రే సోదరులు, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రేలు ఇటీవల ఒకే వేదికపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఈ కలయికపై రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు ఫడణవీస్ అంతే ఘాటుగా బదులిచ్చారు. అసలు ఈ వివాదానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఫడణవీస్ చేసిన ‘శవం దగ్గర ఏడ్చినట్లు’ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి!
ఠాక్రే సోదరుల కలయిక: ఫడణవీస్ వల్లేనా రాజ్ వ్యాఖ్యలు:
మహారాష్ట్రలో ఇటీవల హిందీ భాషను ప్రాథమిక పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ ఫడణవీస్ సర్కార్ తీసుకువచ్చిన త్రిభాషా విధానంపై శివసేన యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు తీవ్ర నిరసనలు చేపట్టాయి. మరాఠీ భాషా పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చాటుతూ ఈ రెండు పార్టీలు ఉమ్మడి ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనల ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని రద్దు చేసింది. ఈ విజయానికి ప్రతీకగా ముంబయిలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికపై కలుసుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి ఇద్దరు సోదరులు పూలమాలలు వేసి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై విమర్శలు గుప్పించారు. “తమ ఇద్దరిని (ఉద్ధవ్, రాజ్ ఠాక్రే) కలపడం బాలాసాహెబ్ ఠాక్రే వల్ల కాలేదని, కానీ ఫడణవీస్ సర్కారు వల్ల ఇప్పుడు తమ మధ్యన అంతరాలు పూర్తిగా తొలగిపోయాయి. కావునా, ఈ ఘనత అంతా ఫడణవీస్‌కే చెందుతుందని” ఎద్దేవా చేశారు. అంటే, ప్రభుత్వం తీసుకున్న హిందీ విధానమే తమను ఏకం చేసిందని పరోక్షంగా పేర్కొన్నారు.
ఫడణవీస్ కౌంటర్: రాజ్ ఠాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడణవీస్ తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఠాక్రే విజయోత్సవ వేడుకలను ‘రుదాలి’ దగ్గర ఏడుపు’లాగా ఉన్నాయని ఫడణవీస్ విమర్శించారు. ‘రుదాలి’ అనే పదం రాజస్థాన్‌లో విరివిగా ఉపయోగిస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వారి అంత్యక్రియల సమయంలో ఏడవడానికి ఒక మహిళను నియమిస్తారు. అలాంటి మహిళ ఏడ్చినట్లుగా రాజ్ ఠాక్రే మాటలు ఉన్నాయని ఫడణవీస్ వ్యంగ్యంగా అన్నారు. అంటే, రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు కేవలం ఒక నాటకంలాగా ఉన్నాయని, వాటిలో నిజాయితీ లేదని ఫడణవీస్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. తన చర్యల వల్లే ఠాక్రేలు కలిశారని రాజ్ ఠాక్రే చేసిన ఎద్దేవాకు బదులిస్తూ, “నేను ఇలా చేసినందుకు బాలా సాహెబ్ ఠాక్రే నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు” అని పేర్కొన్నారు. అంటే, ఠాక్రే సోదరుల కలయికకు కారణం తాను కాదని, బాలాసాహెబ్ ఆశీస్సులు, సంకల్పమే కారణమని పరోక్షంగా ఫడణవీస్ సూచించారు.
అధికారం కోసమే ఠాక్రేల తహతహ: ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం పైనా దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రేకు మరాఠీ భాషపై మమకారం లేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేసి.. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలా పథకం రచిస్తున్నారో ఉద్ధవ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని ఫడణవీస్ పేర్కొన్నారు. 25 ఏళ్ల పాలన కాలంలో ముంబయిని అభివృద్ధి చేయడంలో శివసేన పూర్తిగా విఫలమైందని ఫడణవీస్ ఆరోపించారు. ఇప్పుడు మా ప్రభుత్వం మరాఠా ప్రజలకు ఇళ్ల స్థలాలతో సహా.. వాటిపై పూర్తి హక్కులను ఇవ్వడంతో వారు అసూయకు లోనవుతున్నారని ఆయన తెలిపారు. దీని ద్వారా ఠాక్రే సోదరుల కలయిక కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఫడణవీస్ పరోక్షంగా విమర్శించారు.
ఠాక్రే బ్రదర్స్ విడిపోయిన వైనం:
ఒకప్పుడు శివసేనలో బాల్ ఠాక్రేకు వారసుడిగా రాజ్ ఠాక్రే పేరుపొందారు. అయితే, కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తీరుతో విభేదించి, రాజ్ ఠాక్రే 2005లో శివసేన నుంచి బయటకు వచ్చేశారు. మరుసటి ఏడాదే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పేరుతో సొంతంగా పార్టీ స్థాపించారు. ఈ విభజనతో కాలక్రమంలో రెండు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే మహారాష్ట్ర ప్రయోజనాల కోసం, మరాఠీ భాషను రక్షించుకోవడం కోసం సోదరుడు ఉద్ధవ్‌తో చిన్న చిన్న వివాదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సిద్ధంగా ఉంటే, ఆయనతో పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అప్పుడే ప్రకటించారు. తాజాగా, ప్రభుత్వ విధానాల విషయంలో ఇద్దరూ కలిసి నిరసన తెలపడం, ఒకే వేదికపైకి రావడంతో వారి మధ్య దూరం పూర్తిగా తగ్గిందని స్పష్టమైంది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


