Durga Puja protest idol : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసుర అవతారమెత్తారు. ఆయన్ను ఆదిపరాశక్తి దుర్గమ్మ తన పాదాలతో తొక్కి, త్రిశూలంతో సంహరిస్తోంది. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ ఖగ్రా శ్మశానవాటికలో ఏర్పాటు చేసిన ఓ పూజా మండపంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. చాముండి అవతారంలో ఉన్న దుర్గామాత, రాక్షస రూపంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను సంహరిస్తున్న ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అసలు ట్రంప్‌ను రాక్షసుడిగా ఎందుకు మార్చారు..? దీని వెనుక ఉన్న కారణాలేంటి?
మిత్రద్రోహానికి ప్రతీకారం : భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరికి నిరసనగానే ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు పూజా కమిటీ నిర్వాహకులు స్పష్టం చేశారు. “భారత్, అమెరికాలు మిత్రదేశాలు. ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహంగా మెలిగారు. కానీ ఇప్పుడు మిత్రద్రోహం చేసి మోసం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కోపంతో భారత్‌పై పన్నుల భారం మోపారు. ప్రతీకార, పెనాల్టీ సుంకాల పేరుతో మన ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు సుంకాలు విధించారు. అందుకే ట్రంప్‌ను ఒక రాక్షసుడిగా పరిగణించి, దుర్గామాత చేతిలో హతమయ్యేలా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దాం,” అని వారు పేర్కొన్నారు.
విగ్రహం ప్రత్యేకతలు :
రూపకల్పన: ముర్షిదాబాద్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి అసిమ్ పాల్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
దృశ్యం: చాముండేశ్వరి రూపంలో ఉన్న దుర్గామాత తన త్రిశూలంతో రాక్షస రూపంలో ఉన్న ట్రంప్‌ను సంహరిస్తున్నట్లుగా ఉంది.
ఇతర దేవతలు: పక్కనే దేవతల సేనాని కార్తికేయుడు నేరుగా ట్రంప్‌పైకి విల్లు ఎక్కుపెడుతుండగా, ట్రంప్ భయంతో వణికిపోతున్నట్లుగా విగ్రహాన్ని రూపొందించారు.
గత 60 ఏళ్లుగా ఖగ్రా ఘాట్ శ్మశాన వాటికలో దుర్గా పూజలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. అయితే, తొలిసారిగా ఇలాంటి వినూత్న నిరసన రూపంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. పంచమి రోజున బెర్హంపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ నదుగోపాల్ ముఖర్జీ పూజలు చేసి ఈ మండపాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది స్థానికంగానే కాక, సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది.
సుంకాల బాదుడే అసలు కారణం : ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో భాగంగా తొలుత చైనా, భారత్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత చైనాతో నెగ్గలేక, భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించారు. భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించడమే కాకుండా, భారత ఔషధాలపై 100 శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు. భారత ఫార్మా పరిశ్రమకు అమెరికానే ప్రధాన మార్కెట్ (సుమారు 40% ఎగుమతులు). ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు దేశీయ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యల పట్ల భారతీయుల్లో పెరుగుతున్న ఆగ్రహానికి ఈ విగ్రహం ఒక ప్రతీకగా నిలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


