Maharashtra| మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అనుమాలపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) స్పందించింది. ఎన్నికల ప్రక్రియపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని ఆ పార్టీకి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతోందని వివరించింది. కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తామని తెలిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలను తెలియజేస్తామని లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం విధితమే. 288 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి 242 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ కూటమి కేవలం 46 సీట్లకే పరిమితమైంది.