EX CJI CHANDRACHUD EXPLAINS DELAY: సుప్రీంకోర్టు అఫ్ఇండియా అంటేనే న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదునైన వ్యాఖ్యలు, సంచలన తీర్పులతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలు దాటినా మాజీ సీజేఐ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదని, వీలైనంత త్వరగా ఆ బంగ్లాను ఖాళీ చేయించాలని ఆ లేఖలో కోరడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాలను జస్టిస్ చంద్రచూడ్ స్వయంగా ఓ జాతీయ ఛానెల్‌కు వివరించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఆ కారణాలు ఏంటి..?
పూర్తి వివరాలు: మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక బంగ్లా ఖాళీ చేయడంలో ఆలస్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయన తన వ్యక్తిగత పరిస్థితులను, ముఖ్యంగా తన కుమార్తెల ఆరోగ్య అవసరాలను బహిర్గతం చేశారు. తనకు ప్రజా బాధ్యతల గురించి పూర్తి అవగాహన ఉందని, ప్రభుత్వ వసతిని ఉద్దేశపూర్వకంగా కొనసాగించాలనే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. తన భార్య కల్పనా దాస్, కుమార్తెలు ప్రియాంక, మహిల గురించి పలు విషయాలు పంచుకున్నారు.
కుమార్తెలకు మందులేని వ్యాధి – నెమలిన్ మయోపతి: జస్టిస్ చంద్రచూడ్ తన కుమార్తెలు ప్రియాంక, మహిలు “నెమలిన్ మయోపతి” అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. ఈ వ్యాధి అస్థిపంజర కండరాలను ప్రభావితం చేస్తుందని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచంలో ఈ రుగ్మతకు ఎటువంటి చికిత్స గానీ, నివారణ గానీ లేదని తెలిపారు. అయితే, దేశ విదేశాలలో ఈ వ్యాధికి మందులను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నెమలిన్ మయోపతి కండరాల క్షీణతకు కారణమవుతుందని, అలాగే శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు. ఇది శ్వాస తీసుకోవడానికి, మాట్లాడడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుందని, అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మార్పులు: ప్రస్తుతం నివసిస్తున్న అధికారిక నివాసంలోని బాత్రూమ్‌లతో సహా అన్నింటినీ తమ కుమార్తెల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. వేరే ఏదైనా ఇంటికి వెళ్లడం తమ కుటుంబానికి అంత సులభం కాదని చెప్పారు. ప్రభుత్వం తమకు తాత్కాలికంగా కేటాయించిన అద్దె వసతి గృహం రెండేళ్లుగా ఉపయోగించకుండా ఉందని, ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆ ఇల్లు సిద్ధం కాగానే అక్కడికి మారిపోతామని ఆయన హామీ ఇచ్చారు
ఇంట్లోనే ఐసీయూ, ప్రత్యేక వైద్య బృందం: కుమార్తెలు అలసటకు గురికాకుండా జాగ్రత్త వహించాలని, ఎందుకంటే అలసటకు గురైతే కండరాలు మరింత క్షీణిస్తాయని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. వారి సాధారణ జీవితానికి పల్మోనాలజిస్టులు, ఐసీయూ నిపుణులు, న్యూరాలజిస్టులు, రెస్పిరేటరీ థెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, ఫిజికల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు సహా బహుళ విభాగాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందం కలిసి పనిచేయాలని తెలిపారు. 2021 డిసెంబర్ నుంచి ప్రియాంక రెస్పిరేటరీ సహాయంతో ఉందని, ఆమెకు అమర్చిన ట్రాకియోస్టమీ ట్యూబ్‌ను వారానికి రెండు సార్లు మార్చాల్సి ఉంటుందని వివరించారు. ఇంట్లో ఐసీయూ సెట్టింగ్ ఉందని, ప్రియాంక ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నందున దుమ్ము, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించుకోవాలని చెప్పారు. తమ భార్య కల్పన ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షకుల గురించి నిరంతరం తెలుసుకుంటోందని, తల్లిదండ్రులుగా తాము వారి జీవితాలను అర్థవంతంగా, సరదాగా మార్చడానికి, సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తామని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
వ్యక్తిగత అభిరుచులు, రోజువారీ జీవితం: జస్టిస్ చంద్రచూడ్ తన కుమార్తెలు ప్రియాంక, మహిలను సంగీతం, కళల వైపు ప్రోత్సహించినట్లు తెలిపారు. వాళ్ళు చెస్ బాగా ఆడతారని, ప్రస్తుతం దిల్లీలోని సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని, దురదృష్టవశాత్తు ఇంటి నుంచే చదువు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వారి రోజువారీ కార్యకలాపాలను తన భార్య కల్పన చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని స్పష్టం చేశారు. కల్పన, తాను వారి పిల్లలతో ఖాళీ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
“నా కూతుర్లు 11 పెంపుడు జంతువులకు పెట్ పేరెంట్స్‌గా ఉన్నారు. మహికి జంతువులు, పక్షులతో విడదీయారని అనుబంధం ఉంది. ప్రియాంక, మహి ఇద్దరూ చాలా చురుకుగా ఉంటారు. వారు మాకు శాకాహార జీవనశైలిని అలవాటు చేశారు,” అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
వసతి మార్పు ప్రయత్నాలు: వీలైనంత త్వరగా ఇల్లు మారేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని, తన ప్రయత్నాల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేశానని మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహం సిద్ధమయ్యే వరకు అద్దెకు ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నించానని, కానీ తక్కువ వ్యవధికి ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఆయన వివరించారు.


