జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. అంచనాలకు భిన్నంగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీకి 41 స్థానాలు అవసరం. మెజార్టీ మార్క్ కంటే అత్యధిక స్థానాల్లో జేఎంఎం కూటమి దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం 51 స్థానాల్లో ఇండి కూటమి ఆధిక్యంలో ఉంది.
బర్హెట్ లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో వెనకంజలో ఉన్నారు. ధన్వార్ లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు. సరయ్ కెలాలో ఝార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంపయీ సోరెన్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీయే మిత్ర పక్షం AJSU చీఫ్ సుదేష్ మెహతో వెనకంజలో ఉన్నారు. ఇండి కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తోంది. జార్ఖండ్ లో పోటీ చేసిన 6 స్థానాల్లో ఐదింటిలో ఆధిక్యంలో ఉంది. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం ఒక్క స్థానం లోనే నెగ్గింది.