Farmer wins on Kaun Banega Crorepati: చదువుకు, జ్ఞానానికి సంబంధం లేదని నిరూపించాడు ఓ అన్నదాత. కుటుంబ కష్టాల వల్ల ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి చెప్పినా, తనకున్న లోకజ్ఞానంతో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) హాట్ సీట్‌లో అద్భుతం చేశాడు. ఏకంగా రూ.50 లక్షలు గెలుచుకుని, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు, దేశ ప్రజలందరి ప్రశంసలూ అందుకున్నాడు. అసలు ఎవరీ కైలాశ్ కుంటేవాడ్..? ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగాడు..?
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా, పైఠాన్ తాలూకా, బాలానగర్ గ్రామానికి చెందిన కైలాశ్ కుంటేవాడ్ ఓ సాధారణ రైతు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక, 12వ తరగతితోనే చదువు ఆపేశాడు. తండ్రితో కలిసి పొలం పనులకు, బావులు తవ్వడానికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
జ్ఞాన సముపార్జన: రోజంతా పొలంలో కష్టపడినా, ఇంటికి వచ్చాక ఆన్‌లైన్‌లో జనరల్ నాలెడ్జ్ వీడియోలు చూడటం, చరిత్ర, భూగోళ శాస్త్ర పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు.
12 ఏళ్ల కల: 2011 నుంచి కేబీసీ షోను చూస్తున్న కైలాశ్, ఎప్పటికైనా ఆ హాట్ సీట్‌లో కూర్చోవాలని కలలు కనేవాడు. ఆ కలే, అతన్ని నిరంతరం జ్ఞానాన్ని సంపాదించేలా చేసింది.
హాట్ సీట్‌పై అద్భుత ప్రదర్శన : ఈ ఏడాది కేబీసీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న కైలాశ్, తన జ్ఞానంతో, వ్యూహాత్మక ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక్కో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఏకంగా రూ.50 లక్షల మైలురాయిని చేరుకున్నాడు. రూ. కోటి ప్రశ్నకు సమాధానంపై సందేహం ఉండటంతో, రిస్క్ తీసుకోకుండా ఆట నుంచి వైదొలగి, రూ.50 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు.
“2011 నుంచి షో చూస్తూ సిద్ధమవుతున్నాను. రూ.కోటి ప్రశ్నకు సమాధానంపై సందేహం ఉండటంతో, ముందుజాగ్రత్తగా ఆట నుంచి తప్పుకున్నాను.”
– కైలాశ్ కుంటేవాడ్, కేబీసీ విజేత
కష్టాల నుంచి కోటీశ్వరుడి వైపు : కైలాశ్ విజయం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. రెండెకరాల పోడు భూమిపై ఆధారపడిన కుటుంబం వారిది. ఈ గెలుపుతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
“నా భర్త కనీసం రూ.10 లక్షలు గెలుస్తాడని నమ్మకం ఉండేది, కానీ ఇంత పెద్ద మొత్తం గెలవడం చాలా ఆనందంగా ఉంది,” అని కైలాశ్ భార్య సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఈ డబ్బును తన ఇద్దరు కుమారుల చదువుకు, ఓ కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఉపయోగిస్తానని కైలాశ్ తెలిపారు. ఉన్నత విద్యావంతులే కాదు, సంకల్పం, పట్టుదల, నిరంతర అభ్యాసం ఉంటే, ఓ సాధారణ రైతు కూడా అసాధారణ విజయాలు సాధించగలడని కైలాశ్ నిరూపించాడు.


