Mumbai: ముంబైలోని సముద్ర తీరంలో పెను ప్రమాదం తప్పింది. గేట్‌వే ఆఫ్ ఇండియా(Gateway Of India)సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వెంటనే స్పందించిన సహాయక చర్యల బృందాలు ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులను రక్షించి మరో బోటులోకి తీసుకువస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడవ సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతుండటం ఇందులో చూడవచ్చు.
కాగా నీల్‌కమల్ అనే పడవ గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో పడవలో 35 మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.