భారత్ లో తొలి జికావైరస్ కేసు నమోదైంది. కర్ణాటకలో తొలి కేసును గుర్తించారు. కరోనా నుండి పూర్తిగా బయటపడుతున్నామనుకుంటున్న తరుణంలో జికా వైరస్ కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. డిసెంబర్ 5న డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలున్న ముగ్గురు పేషెంట్ల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.
వాటికి సంబంధించిన ఫలితాలు ఇటీవలే వచ్చాయి. మూడు శాంపిల్స్ లో రెండు నెగిటివ్ రాగా.. మరొకటి మాత్రం పాజిటివ్ వచ్చింది. ఆ ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. కర్ణాటకలో ఇదే తొలి జికా కేసు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.