Saturday, November 15, 2025
Homeనేషనల్A Unique Rakhi: ఆ ఊరిలో అన్నకు కాదు.. భర్తకే రక్షాబంధన్!

A Unique Rakhi: ఆ ఊరిలో అన్నకు కాదు.. భర్తకే రక్షాబంధన్!

Unique Rakhi traditions : రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధాల వేడుక. సోదరి ప్రేమగా కట్టే రాఖీ, సోదరుడి రక్షణకు ప్రతీక. దేశమంతా ఈ పండుగను ఇదే భావనతో జరుపుకుంటుంది. కానీ, దేశం నడిబొడ్డున ఉన్న మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ సంప్రదాయం పూర్తి భిన్నం. అక్కడ మహిళలు తమ సోదరులకు కాదు, ఏడడుగుల బంధంతో జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తలకే రాఖీ కడతారు. అసలు ఈ వింత సంప్రదాయానికి కారణమేంటి..? కేవలం భర్తలకేనా, ఇంకెవరికైనా రాఖీ కడతారా..? శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలుసుకుందాం.

- Advertisement -


మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో నివసించే గోండు గిరిజన సమాజంలో ఈ ప్రత్యేకమైన సంప్రదాయం నేటికీ సజీవంగా ఉంది. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు, ఇక్కడి మహిళలు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీ కట్టరు. అందుకు బదులుగా, తమ మెట్టినింట, తమ భర్తలకే ఆ రక్షాబంధనాన్ని కట్టి ఆశీస్సులు తీసుకుంటారు.

భర్తే నిజమైన రక్షకుడు: ఈ ఆచారం వెనుక బలమైన నమ్మకం ఉంది. సోదరుడు తన పెళ్లి తర్వాత వేరే కుటుంబానికి పెద్ద దిక్కు అవుతాడని, కానీ భర్త మాత్రమే జీవితాంతం కష్టసుఖాల్లో పక్కనే ఉంటూ, ఎలాంటి ఆపద నుంచైనా కాపాడే నిజమైన రక్షకుడని గోండు మహిళలు బలంగా విశ్వసిస్తారు. ఈ కృతజ్ఞతా భావంతోనే వారు భర్తలకు రాఖీ కడతారు. బమన్వాడా గ్రామానికి చెందిన అంజెలాల్ గౌడ్ అనే స్థానికుడు ఇదే విషయాన్ని ధృవీకరించారు. “మా మహిళలు తమ జీవితంలో నిజమైన రక్షకుడు భర్త అనే భావిస్తారు. అందుకే ఈ సంప్రదాయం కొనసాగుతోంది,” అని ఆయన తెలిపారు.

ప్రకృతికి కూడా రక్షాబంధన్: గోండు గిరిజనుల జీవితం అడవితో, వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. అందుకే వారు ప్రకృతిని దైవంగా భావిస్తారు. రక్షాబంధన్ రోజున, భర్తలకు రాఖీ కట్టడంతో పాటు, తమ జీవనాధారమైన పంట పొలాలకు, అడవిలోని చెట్లకు కూడా రాఖీ కడతారు. ఇది ప్రకృతి పట్ల వారు చూపే కృతజ్ఞతకు, గౌరవానికి నిలువుటద్దం.

ప్రత్యేకమైన ‘దేవ్ రాఖీ’: మార్కెట్లో దొరికే రంగురంగుల రాఖీలకు బదులుగా, గోండులు తమ సంప్రదాయ ‘దేవ్ రాఖీ’లనే ఎక్కువగా ఉపయోగిస్తారు.

తయారీ: ఈ రాఖీలను వారే స్వయంగా పసుపు దారం, దూదితో తయారు చేస్తారు.
విధివిధానం: మొదట ఈ ‘దేవ్ రాఖీ’లకు పూజలు చేసి, ఆ తర్వాత వాటిని తమ పొలాల్లోని పంటలకు, జీవనాధారమైన చెట్లకు కడతారు.

మారుతున్న కాలం.. నిలుస్తున్న సంప్రదాయం: అయితే, ఆధునిక పోకడలతో ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారుతున్నాయని అంజెలాల్ గౌడ్ అంగీకరించారు. “ఇప్పుడిప్పుడే కొందరు తమ ఇంట్లో ఉన్న కుమారులకు, అన్నలకు కూడా రాఖీలు కట్టే ధోరణి మొదలవుతోంది. అయినప్పటికీ, పాత సంప్రదాయాల ప్రకారం భర్తకు, చెట్లకు రాఖీ కట్టే పూజలు, పండుగలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి,” అని ఆయన వివరించారు.
భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఈ గోండుల రాఖీ సంప్రదాయం ఓ చక్కటి నిదర్శనం. భర్త పట్ల ప్రేమను, ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటుకునే ఈ ప్రత్యేక పండుగ, వారి జీవన విధానానికి అద్దం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad