Saturday, November 15, 2025
Homeనేషనల్Annakut Utsav: దేవుడికే కన్నం.. ప్రసాదమే ప్రాణం! ఆలయంలో అన్నం దొంగతనం.. 250 ఏళ్ల సంప్రదాయం!

Annakut Utsav: దేవుడికే కన్నం.. ప్రసాదమే ప్రాణం! ఆలయంలో అన్నం దొంగతనం.. 250 ఏళ్ల సంప్రదాయం!

Unique religious traditions : గుడిలో దొంగతనం మహాపాపం… కానీ, ఓ ఆలయంలో దేవుడి ప్రసాదాన్ని దొంగిలించడమే పుణ్యం! వందలాది మంది భక్తులు ఎగబడి మరీ ప్రసాదాన్ని లూటీ చేస్తారు. ఇది నేరం కాదు, 250 ఏళ్లుగా వస్తున్న ఓ వింత ఆచారం. చుట్టుపక్కల 80 గ్రామాల ప్రజలు ఈ “దొంగతనం” కోసమే ఆవురావురుమంటూ ఎదురుచూస్తారు. అసలు ఈ వింత సంప్రదాయం ఎక్కడిది? దేవుడి నైవేద్యాన్ని దొంగిలించడం వెనుక ఉన్న నమ్మకం ఏంటి?

- Advertisement -

అన్నకూట్.. ఓ అపురూప వేడుక : గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ రంఛోడరాజి (శ్రీకృష్ణుడు) ఆలయం ఈ వింత సంప్రదాయానికి వేదిక. ఏటా దీపావళి పండుగ మరుసటి రోజున ఇక్కడ “అన్నకూట్ ఉత్సవం” అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారికి టన్నుల కొద్దీ అన్నప్రసాదాలు, పిండివంటలు సమర్పిస్తారు. ఈ ఏడాది ఏకంగా 3,020 కిలోల అన్నప్రసాదాన్ని నివేదించారు.

దొంగతనమే ఓ పండుగ : ఈ ఉత్సవంలో అసలు సిసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. స్వామివారికి మహా హారతి ఇచ్చాక, ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచరు. బదులుగా, ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను లోపలికి అనుమతిస్తారు. అప్పుడు వందలాది మంది భక్తులు ఒక్కసారిగా ఎగబడి, స్వామివారి ముందున్న ప్రసాదాన్ని చేతికి దొరికినంత దొంగిలించుకుపోతారు. ఈ ప్రసాదాన్ని దొంగిలించి తింటే, ఏడాది పొడవునా ఎలాంటి అనారోగ్యాలు రావని, సుఖసంతోషాలతో ఉంటారని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ “ప్రసాదం లూటీ”ని వారొక పవిత్రమైన పండుగలా జరుపుకుంటారు.

నైవేద్యంలో ఏముంటుంది : అన్నకూట్ నైవేద్యంలో బియ్యం, పప్పుధాన్యాలు, నెయ్యితో చేసిన వంటకాలతో పాటు రకరకాల స్వీట్లు ఉంటాయి. ముఖ్యంగా మైసూర్‌పాక్, బూందీ లడ్డూలు ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రసాద రాశిపై కిలోన్నర బరువున్న నెయ్యి బూందీ లడ్డును అలంకారంగా ఉంచుతారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన దానికి ప్రతీకగా ఈ అన్నకూట్ ఉత్సవాన్ని నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

“దేవుడికి అనేక కానుకలు సమర్పించినా, అన్నప్రసాదం ప్రత్యేకం. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసాదం సమర్పించి, 1:30 గంటల తర్వాత 80 గ్రామాల భక్తులను దొంగిలించేందుకు అనుమతిస్తాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఇది జరుగుతుంది. ఈ అన్నకూట్ దొంగతనం ఏళ్లుగా కొనసాగుతుంది.”
– జనక్ మహారాజ్, ఆలయ ప్రధాన పూజారి

ఇదో వింత ఆచారం.. శ్మశానంలో దీపావళి : ఒకవైపు ప్రసాదం దొంగతనం వింత అయితే, మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ప్రజలు దీపావళిని శ్మశానవాటికలో జరుపుకుంటారు. పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే, వీరు మాత్రం సమాధుల వద్దకు వెళ్లి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు. గత 20 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ, మరణించిన తమ ఆత్మీయులను స్మరించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad