Boss gifts cars to employees : దీపావళి బోనస్ అంటే స్వీట్లు, చిన్న చిన్న బహుమతులు ఇచ్చే రోజులు పోయాయి. హరియాణాకు చెందిన ఓ ఔషధ కంపెనీ యజమాని, తన ఉద్యోగుల పట్ల ఔదార్యాన్ని చాటుకుని, దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. పండగ కానుకగా ఏకంగా 51 మంది ఉద్యోగులకు సరికొత్త కార్లను బహూకరించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అసలు ఎవరా ఆదర్శ యజమాని..? ఆయన ఎందుకింతటి భారీ కానుక ఇచ్చారు..?
హరియాణాలోని పంచకులా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ ‘మిట్స్ నేచురా లిమిటెడ్’. దీని యజమాని ఎంకే భాటియా, ఈ దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. కంపెనీ విజయానికి మూలస్తంభాలుగా నిలిచిన 51 మంది ఉద్యోగులను ఎంపిక చేసి, వారికి సరికొత్త కార్లను బహుమతిగా అందించారు. భాటియా స్వయంగా కార్ల తాళాలను అందజేయడంతో, ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నగర వీధుల్లో కార్ల ర్యాలీ : కొత్త కార్ల తాళాలు అందుకున్న ఉద్యోగులు, తమ ఆనందాన్ని పంచుకునేందుకు నగరంలో ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. కంపెనీ కార్యాలయం నుంచి మిట్స్ హౌస్ వరకు, మెరిసే కొత్త కార్లతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ ర్యాలీ పంచకులా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“నా ఉద్యోగులే నా బలం” : ఇంతటి భారీ బహుమతులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాన్ని భాటియా ఎంతో వినమ్రంగా వివరించారు.
“నా ఉద్యోగులే మా కంపెనీ వెన్నెముక. వారి కష్టం, నిబద్ధతే మా విజయానికి పునాది. వారిని ప్రోత్సహించడమే నా ఉద్దేశ్యం. ఇది ప్రదర్శన కాదు, మా టీమ్ స్పిరిట్‌ను, కుటుంబ బంధాన్ని పెంచే మార్గం. నా టీమ్ సంతోషంగా ఉంటే, కంపెనీ దానంతట అదే ఎదుగుతుంది.”
– ఎంకే భాటియా, యజమాని, మిట్స్ నేచురా లిమిటెడ్
భాటియా తీరుతో, ఉద్యోగులు ఆయన్ను “మా బాస్ కాదు, మా ఫ్యామిలీ మెంబర్” అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ప్రతి ఏటా ఇదే సంప్రదాయం : భాటియా ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత 2023, 2024 దీపావళి పండుగలకు కూడా ఆయన తన ఉద్యోగులకు కార్లను బహూకరించి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టారు. ఆయన ఔదార్యంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉద్యోగుల సంతోషమే కంపెనీ విజయానికి మూలమనే విషయాన్ని ఆయన చేతల్లో చూపిస్తూ, ఎందరో పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


