Haryana dog bite compensation : వీధికుక్కల దాడులతో జనం బెంబేలెత్తుతున్న వేళ, ఓ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచేందుకు నడుం బిగించింది. కుక్క కాటుకు గురైన వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ, దేశంలోనే ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గాయం తీవ్రతను బట్టి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పరిహారం అందించనుంది. ఇంతకీ ఏ రాష్ట్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది? ఈ పరిహారం పొందాలంటే అర్హతలేంటి? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అండగా నిలుస్తున్న హరియాణా ప్రభుత్వం : రోజురోజుకు పెరుగుతున్న కుక్క కాటు కేసులను తీవ్రంగా పరిగణించిన హరియాణా ప్రభుత్వం, బాధితుల కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పరివార్ సురక్ష యోజన (దయాళ్-II)’ కింద ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం, కుక్క కాటు గాయం ఆధారంగా పరిహారాన్ని నిర్ణయిస్తారు.
సాధారణ గాటుకు: కుక్క పంటి ముద్ర మాత్రమే పడితే కనీసం రూ.10,000 పరిహారం.
లోతైన గాయానికి: గాటు లోపలికి చొచ్చుకుపోయి, గాయం తీవ్రంగా ఉంటే రూ.20,000 వరకు పరిహారం అందిస్తారు.
పరిహారం పొందాలంటే.. ఈ నిబంధనలు తప్పనిసరి : ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది.
వీధి కుక్క లేదా పెంపుడు కుక్క కరిచి ఉండాలి.
దాడి బహిరంగ ప్రదేశంలో జరిగి ఉండాలి.
దాడి చేసేలా బాధితులు కుక్కను ప్రేరేపించి ఉండకూడదు.
దాడి వల్ల స్పష్టమైన శారీరక గాయాలు ఉండాలి.
బాధితుడి కుటుంబ వార్షిక ఆదాయం ₹1,80,000 లోపు ఉండాలి.
హరియాణా ప్రభుత్వం జారీ చేసిన పరివార్ పెహచాన్ పత్ర (PPP) నంబర్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ పథకం గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచే అమల్లోకి వస్తుందని, అంతకు ముందు జరిగిన ఘటనలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వయసు ఆధారంగానూ పరిహారం : కుక్క కాటు వల్ల తీవ్ర గాయాలై అంగవైకల్యం సంభవించినా లేదా మరణం సంభవించినా, బాధితుడి వయసు ఆధారంగా అదనపు పరిహారాన్ని అందిస్తారు.
వయసు పరిహారం (రూ.)
0 – 12 ఏళ్లు 1,00,000
12 – 18 ఏళ్లు 2,00,000
18 – 25 ఏళ్లు 3,00,000
25 – 45 ఏళ్లు 5,00,000
45 ఏళ్లు పైబడి 3,00,000
దరఖాస్తు ప్రక్రియ ఎలా : ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేశారు.
ఆన్‌లైన్ దరఖాస్తు: బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు, ఘటన జరిగిన 90 రోజుల్లోగా https://dapsy.finhry.gov.in అనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కమిటీ పరిశీలన: ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలిస్తుంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే, 120 రోజుల్లోగా పరిహారాన్ని సిఫార్సు చేస్తుంది.
“పేద కుటుంబాల కోసమే ఈ పథకాన్ని ప్రారంభించాం. బాధితులకు పరిహారం అందించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల కోసం షెల్టర్ హౌస్‌లు ఏర్పాటు చేస్తాం,” అని రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ తెలిపారు. హరియాణాలో రోజూ సగటున 100 కుక్క కాటు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ పథకం ఎందరో బాధితులకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.


