Sabarimala| నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలలో అయ్యప్పస్వామి కొలువైన పతనంతిట్ట జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు.
పంబ, సన్నిధానంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్(NDRF), అగ్నిమాపక సిబ్బంది, రాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.