Heavy traffic on National Highway: బీహార్ గుండా వెళ్తున్న ఢిల్లీ-కోల్‌కతా నేషనల్ హైవే-19 పై గత నాలుగు రోజులుగా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోహ్తాస్ నుంచి ఔరంగాబాద్ వరకు సుమారు 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలతోనే ఈ దుస్థితి: గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. దీంతో రోడ్లు భారీ గుంతలు పడి ఛిద్రమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. వాహనాలు 24 గంటల్లో ఐదు కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేకపోతున్నాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-for-telangana-and-ap/
డ్రైవర్ల ఆవేదన: గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ట్రక్కు డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లే ముందుకు వెళ్లామని అక్కడి వాహన డ్రైవర్లు వాపోతున్నారు. టోల్ ఫీజు, రోడ్డు పన్నులు అన్నీ కడుతున్నా మాకు ఈ నరకం తప్పడం లేదని అన్నారు. ఇక్కడ ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది గానీ, అధికారులు గానీ ఎవరూ కనిపించడం లేదని అన్నారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక ఇక్కడే పడి ఉన్నామని తమ ఆవేదనను తెలిపారు. కొన్ని కిలోమీటర్ల దూరం కదలడానికే గంటల సమయం పడుతోందని తెలిపారు.
అత్యవసర సేవలకు అంతరాయం: ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా వ్యాపార కార్యకలాపాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పండ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లలో ఆందోళన నెలకొంది. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంత జరుగుతున్నా స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై వివరణ కోరగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ కెమెరా ముందు మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం.


