Himachal Pradesh Devastated by Floods: ఆకుపచ్చని లోయలు, మంచు కిరీటాలు ధరించిన శిఖరాలు.. కొన్ని రోజులకు ముందు పర్యాటకుల స్వర్గంగా, ప్రకృతి ఒడిలో పర్యాటకులను ఓలలాడించిన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్… కానీ నేడు, జడివాన దాటికి పండుటాకుల వణికిపోతోంది. కొండ చరియలు విరిగి గుండెని గుప్పెట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటోంది. పర్వతాలు కరిగి కన్నీళ్లు పెట్టుకున్నట్లు.. హిమాచల్ లోయల్లో జల ప్రళయ ఉన్మాదం ఉప్పొంగుతోంది. ఇప్పుడు హిమాచల్ … గుండెలు పిండే విషాదంతో, కన్నీళ్లు ఆగని రోదనలతో జల ప్రళయం నుంచి విముక్తి కోరుతోంది. ఇంతకీ, దేవభూమిలో ఏం జరుగుతోంది..? ప్రకృతి ఎందుకింత ఉగ్రరూపం దాల్చింది..? ఈ విపత్తు నుంచి కోలుకునేదెలా.? నిపుణుల విశ్లేషణతో కూడిన ప్రత్యేక కథనం మీకోసం…
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం: జూన్ 20 నుంచి జూలై 2, 2025 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అక్షరాలా జలప్రళయంలో ముంచెత్తాయి. మండీ, కులు, కాంగ్రా, సిర్మౌర్, షిమ్లా వంటి కీలక జిల్లాలు అత్యంత తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (HP-SEOC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఇప్పటివరకు… ఈ విపత్తులో 51 మంది మృతి చెందగా, మరో 22 మంది ఆచూకీ గల్లంతైంది. దీనికి అదనంగా 103 మంది గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతులలో అత్యధికంగా మండీ జిల్లాలో 10 మరణాలు నమోదయ్యాయి.
హిమాచల్ జలవిలయం – దిగ్భ్రాంతికర వాస్తవాలు
బియాస్ ఉగ్రరూపం: మునిగిన మండీ.. 20 అడుగులు పెరిగిన నీటిమట్టం : మండీ జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహించడంతో కర్సోగ్, ధరమ్‌పూర్, పండోహ్, థునాగ్ ప్రాంతాలలోని బజార్లు, గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ధరమ్‌పూర్‌లో నదీ జలమట్టం సాధారణ స్థాయి కంటే ఏకంగా 20 అడుగులు ఎక్కువగా నమోదైందని అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
చండీగఢ్-మనాలీపై కొండచరియలు : రాష్ట్రవ్యాప్తంగా 259 ప్రధాన రహదారులు మూసివేశారు. వీటిలో మండీలో 139, సిర్మౌర్‌లో 92 రహదారులు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వేలాది వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 130 నీటి పథకాలు ధ్వంసం : రాష్ట్రవ్యాప్తంగా 614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 130 మంచినీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. దీంతో వేల కుటుంబాలకు విద్యుత్, నీటి సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నది. పునరుద్ధరణ పనులకు సమయం పట్టే అవకాశం ఉంది.
51 మరణాలు.. 10 ఇళ్లు, 12 గోడౌన్లు నేలమట్టం : ఆకస్మిక వరద ప్రవాహం, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు, రోడ్డు ప్రమాదాల కారణంగా.. 51 మరణాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. దీనితో పాటుగా పది పక్కా ఇళ్లు, 12 గోడౌన్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. 26 పశువులు మరణించాయి.
రెడ్ అలర్ట్, ముందుజాగ్రత్త చర్యలు: భారత వాతావరణ శాఖ (IMD) మండీ, షిమ్లా, కాంగ్రా, బిలాస్‌పూర్, సోలన్, సిర్మౌర్, హమీర్‌పూర్, ఊనా, కులు, చంబా జిల్లాలకు “రెడ్ అలర్ట్” జారీ చేసింది. జూలై 5 వరకు అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. పరిస్థితిని అంచనా వేసి, మండీ, కాంగ్రా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటకులు నదులు, కొండ ప్రాంతాల దగ్గరకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. ఇది పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు రంగంలోకి దిగి, 332 మందిని సురక్షితంగా రక్షించాయి. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.
షిమ్లాలో కూలిన ఐదంతస్థుల భవనం : షిమ్లాలోని భట్టకుఫర్ ప్రాంతంలో ఐదంతస్థుల భవనం భారీ వర్షాల కారణంగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ, భవనాన్ని ముందుగానే ఖాళీ చేయడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి, రాష్ట్రంలో నెలకొన్న విపత్తు తీవ్రతను సూచిస్తున్నాయి.
ప్రభుత్వ చర్యలు- నష్టాలు: ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణపై అత్యవసర సమావేశం నిర్వహించింది. రాష్ట్ర రెవెన్యూ, ఉద్యాన, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జగత్ సింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని అప్రమత్తంగాఉండాలని ఆదేశించారు.
ఆర్థిక నష్టం: 2024-25 సంవత్సరం మాన్సూన్ సమయంలో రాష్ట్రం రూ.1,140 కోట్ల భారీ నష్టం జరిగింది. ఇందులో రహదారులు (రూ.502 కోట్లు), జలశక్తి శాఖ (రూ.469 కోట్లు) అత్యధిక నష్టాన్ని చవి చూశాయి.
పవర్ ప్రాజెక్టులు: మలానా-II హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. సైంజ్ బ్యారేజ్, పర్బతి-II, బైరా HEP, ప్రాజెక్టులు కూడా అధిక సిల్ట్ కారణంగా మూసివేశారు. ఇది రాష్ట్ర విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గతంలో ఇలాంటి విపత్తులు: వాతావరణ మార్పుల ప్రభావం: 2023లో హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన విపత్తు 330 మంది మరణాలకు కారణమైంది. 10,140 పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 2,546 ఇళ్లు పూర్తిగా నేల మట్టమాయ్యాయి. ఇప్పుడు సంభవించిన విపత్తు కూడా గతపు నష్టాన్ని పునరావృతం చేస్తోంది. వాతావరణంలోని మార్పులు ఈ ఘటనల తీవ్రతను పెంచుతున్నాయని నిపుణులు చర్చిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన నిర్మాణాలు, అటవీ నిర్మూలన కూడా విపత్తు తీవ్రతకు కారణమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సహాయక చర్యలు- భవిష్యత్తు దిశ: ప్రధానమంత్రి మోదీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. NDRF, SDRF బృందాలు ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
రాష్ట్రంలోని పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థ ఈ విపత్తు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ పర్యటనలను వాయిదా వేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పులు, అసమర్థమైన డ్రైనేజీ వ్యవస్థలు ఈ విపత్తు తీవ్రతను మరింత పెంచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.


