Ilaiyaraaja Mookambika Temple Donation: స్వరాలతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన సంగీతఇళయరాజా, తన భక్తి ప్రపత్తులను ఓ అపురూప కానుక రూపంలో చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన వజ్రకిరీటాన్ని సమర్పించి, తన అపారమైన భక్తిని చాటుకున్నారు.
అమ్మవారికి అపురూప కానుక : ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా గురువారం ఉడుపిలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన, వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహూకరించారు. అంతేకాకుండా, ఆలయంలోని వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని (కత్తి) కూడా సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
సంగీత వాయిద్యాల మధ్య, పూర్ణకుంభ స్వాగతంతో కిరీటాన్ని ఊరేగింపుగా గర్భగుడి వరకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం, ఇళయరాజా స్వయంగా కిరీటాన్ని, ఆయుధాన్ని అమ్మవారికి, స్వామివారికి అందజేశారు.
ALSO READ:https://teluguprabha.net/national-news/supreme-court-refuses-to-hear-kangana-ranauts-petition/
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇళయరాజాను సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు కార్తిక్, మనవడు యతీశ్ కూడా పాల్గొన్నారు. దీనిపై ఇళయరాజా ఎంతో వినమ్రంగా స్పందిస్తూ, “ప్రతిదీ జగన్మాత మూకాంబిక అమ్మ ఆశీస్సులతోనే సాధ్యమైంది, ఇందులో నేను చేసిందేమీ లేదు,” అని పేర్కొన్నారు.
ఏళ్లనాటి అనుబంధం : ఇళయరాజాకు మూకాంబిక అమ్మవారంటే అపారమైన భక్తి అని, ఏళ్లుగా ఆయన ఆలయానికి తరచూ వస్తుంటారని ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబు శెట్టి తెలిపారు. “ఇళయరాజా గారు తన పుట్టినరోజును కూడా అమ్మవారి సన్నిధిలోనే జరుపుకుంటారు. 2006లో కూడా అమ్మవారికి ఓ వజ్ర కిరీటాన్ని బహూకరించారు,” అని ఆయన గుర్తుచేశారు.
తమిళనాడు ప్రభుత్వ సత్కారం : ఇటీవల లండన్‌లో సింఫొనీ నిర్వహించి, విదేశాల్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ఇళయరాజాను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వాస్తవానికి జూన్ 2న జరగాల్సిన ఈ కార్యక్రమం, అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 13న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ సన్మాన కార్యక్రమం జరగనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.


