Parliament debate on SIR : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గరం గరంగా సాగుతున్నాయి. బిహార్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై ‘ఇండియా’ కూటమి సమరశంఖం పూరించింది. ఇది ఓట్ల దొంగతనానికి వేసిన పక్కా ప్రణాళిక అని ఆరోపిస్తూ, ఉభయ సభల్లో తక్షణమే చర్చ జరపాలని పట్టుబడుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, ఈసీ స్వతంత్ర సంస్థ అని చెబుతూ చర్చకు ససేమిరా అంటోంది. అసలు ఈ ‘ఎస్ఐఆర్’ అంటే ఏమిటి..? దీనిపై విపక్షాలకు ఎందుకంత అనుమానం..? ప్రభుత్వం చర్చకు ఎందుకు నిరాకరిస్తోంది.
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ జరగాల్సిందేనని ‘ఇండియా’ కూటమి పార్టీలు ఏకతాటిపై నిలిచాయి. బుధవారం విజయ్ చౌక్‌లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విపక్షాల వాదన : ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదలు, దళితులు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు కుట్ర పన్నుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఖర్గే ఆరోపణ: “ప్రజల ఓటు హక్కును దొంగిలించవద్దని మేము లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ ఛైర్మన్‌ను, ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాం. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియలో అదే జరుగుతోంది. ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈసీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోంది. వ్యక్తుల పౌరసత్వంపైనే సందేహాలు రేకెత్తించే ప్రయత్నం ఇది” అని ఖర్గే ఆరోపించారు.
కేసీ వేణుగోపాల్ విమర్శ: “ఈసీ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలనే ప్రశ్నిస్తోంది. మోదీ సర్కార్ ఈ విషయంలో ఏదో దాచాలని చూస్తోంది, అందుకే చర్చకు అంగీకరించడం లేదు. ఎస్ఐఆర్ వల్ల మైనారిటీలు, దళితులు, ఆదివాసీలతో పాటు, వలస కార్మికులు కూడా ఓటు హక్కు కోల్పోతున్నారు” అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు.
ఆందోళనలకు పిలుపు: ఈ సమస్యపై పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు కొనసాగిస్తామని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాగరికా ఘోష్ ప్రకటించారు. ఆగస్టు 11న ‘ఇండియా’ కూటమి పార్టీలన్నీ కలిసి ఈసీ కార్యాలయం వద్దకు మార్చ్ నిర్వహిస్తాయని ఆమె తెలిపారు.
ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది: విపక్షాల ఆరోపణలను, చర్చకు డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పష్టత ఇచ్చారు.
రెండు ప్రధాన కారణాలు..
కోర్టు పరిధిలో అంశం: ఎస్ఐఆర్ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై సభలో చర్చించడానికి పార్లమెంట్ నియమాలు అనుమతించవని రిజిజు స్పష్టం చేశారు.
స్వతంత్ర సంస్థ: భారత ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని, దాని పనితీరును పార్లమెంటులో చర్చించడం సంప్రదాయం కాదని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఓటు హక్కును కాలరాస్తున్నారంటూ విపక్షాలు, మరోవైపు నిబంధనలు అంగీకరించవంటూ ప్రభుత్వం మొండిపట్టుతో ఉండటంతో ‘ఎస్ఐఆర్’ అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ ప్రతిష్టంభన రానున్న రోజుల్లో మరింత ముదిరి, పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.


