India’s stance on Russia-Ukraine conflict : ప్రపంచాన్ని కలవరపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు..? ఈ భీకర పోరులో శాంతి పావురాన్ని ఎగరేసేదెవరు..? ఈ ప్రశ్నలకు సమాధానంగా, ప్రపంచ వేదికపై భారత్ తన గళాన్ని మరోసారి బలంగా వినిపించింది. దౌత్యమే ఏకైక మార్గమని, శాంతి స్థాపనకు తాము సైతం అంటోంది. ఇంతకీ, ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన కీలక ప్రకటన ఏంటి..? ప్రధాని మోదీ తెర వెనుక నడుపుతున్న మంతనాలేమిటి..?
ఐరాసలో భారత శాంతి మంత్రం : ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ‘ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగ పరిస్థితి’పై జరిగిన చర్చలో భారత్ తన వైఖరిని నిక్కచ్చిగా వెల్లడించింది. ఐరాసలో భారత రాయబారి పి. హరిశ్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ సంక్షోభానికి యుద్ధభూమిలో పరిష్కారం లభించదని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని తేల్చిచెప్పారు. “ఈ సంఘర్షణకు త్వరగా ముగింపు పలకడానికి అవసరమైన అన్ని దౌత్య ప్రయత్నాలకు భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణనష్టం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అందరికీ అంత మంచిదని భారత్ అభిప్రాయపడింది.
‘ఇది యుద్ధ యుగం కాదు’ : ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు చెప్పిన “ఇది యుద్ధం చేసే యుగం కాదు” అన్న మాటలను హరిశ్ గుర్తుచేశారు. ఈ స్ఫూర్తితోనే ప్రధాని మోదీ నిరంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. కేవలం ఇరు దేశాధినేతలతోనే కాకుండా, యూరప్ నాయకత్వంతోనూ టచ్‌లో ఉంటూ, శాంతి స్థాపన కోసం మార్గాలను అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు సఫలమై, శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తాయని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
‘గ్లోబల్ సౌత్’ గోస : ఈ యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్ సౌత్) తీవ్రంగా నష్టపోతున్నాయని రాయబారి హరిశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటి, వారి ఆర్థిక వ్యవస్థలపై పెను భారం పడుతోందన్నారు. “వారి ఆందోళనలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. వారి సమస్యలకు కూడా సమాధానం దొరకాలి,” అని ఆయన అన్నారు. భారత్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, అందుకే ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందించడంతో పాటు, కష్టాల్లో ఉన్న పొరుగు దేశాలకు, ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని గుర్తుచేశారు.
అగ్రనేతల మంతనాలు : మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహాతో ఫోన్‌లో సంభాషించారు. యుద్ధాన్ని ముగించేందుకు భారత్ ఇస్తున్న మద్దతు తమకు ఎంతో కీలకమని, అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలలో భారత్ చురుకైన పాత్ర పోషించాలని సిబిహా కోరారు. దీనికి జైశంకర్ బదులిస్తూ, యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని, దౌత్య చర్చలే శాంతికి ఏకైక మార్గమని, అమాయకుల ప్రాణాలను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని పునరుద్ఘాటించారు.


