పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్(India), పాకిస్థాన్(Pakistan) దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. దీంతో ఇరు దేశాల సైనిక సామర్థంపై(Military Strength) అంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల సైనిక శక్తిని అంచనా వేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్-2025 తాజా నివేదిక భారత్-పాక్ దేశాల సైనిక సామర్థ్యాలను స్పష్టంగా వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 12వ స్థానంలో నిలిచింది. సైనిక సిబ్బంది విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. భారత్‌లో 14,55,550 మంది క్రియాశీలక సైనికులు ఉండగా, 11,55,000 మంది రిజర్వ్ సిబ్బంది, 25,27,000 మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. పాకిస్థాన్‌లో 6,54,000 మంది క్రియాశీలక సైనికులు, 5,50,000 మంది రిజర్వ్ సిబ్బంది, 5,00,000 మంది పారామిలిటరీ దళాలు ఉన్నారు.
వైమానికి దళాల విషయానికొస్తే.. భారత్ వద్ద మొత్తం 2,229 విమానాలు ఉండగా, పాకిస్థాన్ వద్ద 1,399 విమానాలు ఉన్నాయి. భారత్ వద్ద 513 కీలకమైన యుద్ధ విమానాలు ఉండగా… పాకిస్థాన్ వద్ద 328 ఉన్నాయి. అలాగే భారత్ వద్ద 80 ఎటాక్ హెలికాప్టర్లు ఉండగా, పాకిస్థాన్ వద్ద 57 ఉన్నాయని నివేదికలో పేర్కొంది.
నౌకాదళ బలం విషయంలో.. భారత్ వద్ద మొత్తం 293 నౌకాదళ ఆస్తులు ఉండగా, పాకిస్థాన్ వద్ద 121 ఉన్నాయి. ముఖ్యంగా భారత్ రెండు విమాన వాహక నౌకలను కలిగి ఉండగా పాకిస్థాన్ వద్ద ఒక్కటి కూడా లేదు. భారత్ వద్ద 18 జలాంతర్గాముల(సబ్ మెరైన్స్) ఉండగా.. పాకిస్థాన్ వద్ద 8 ఉన్నాయని తెలిపింది. అలాగే భారత్ వద్ద 13 డిస్ట్రాయర్లు ఉండగా పాకిస్థాన్ వద్ద ఒక్కటి కూడా లేదని వెల్లడించింది.
ఇక భూతల దళాల సామర్థ్యాన్ని పరిశీలిస్తే.. భారత్ వద్ద 4,201 యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్థాన్ వద్ద 2,627 ట్యాంకులు ఉన్నాయి. ఆర్మర్డ్ వాహనాల సంఖ్యలో భారత్ 1,48,594.. పాకిస్థాన్ 17,516 కన్నా చాలా ముందుంది. అయితే మొబైల్ రాకెట్ వ్యవస్థల విషయంలో పాకిస్థాన్ (600)… భారత్ (264) కంటే ఎక్కువ సంఖ్యను కలిగి ఉంది. మొత్తమ్మీద చూసుకుంటే భారత్ ఎక్కువ సైనిక బలం కలిగి ఉంది.